TEACHER FRS# టీచర్లు ఇక సంతకాలు పెట్టడం కుదరదు
TEACHER FRS# టీచర్లు ఇక సంతకాలు పెట్టడం కుదరదు
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్/స్మార్ట్ ఫోన్లలో జూన్ 12లోపు FRS యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయుల ఫొటోల ద్వారా ఆ రోజు ఎంత మంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటుంది.
ఒక విద్యార్థి ఒకట్రెండు రోజులు బడికి రాకపోతేనే ఎందుకురాలేదని అడిగే రోజులివి. కానీ ఇలా అడగాల్సిన కొంత మంది టీచర్లు ఇష్టానుసారంగా విధులకు డుమ్మా కొడుతున్నారు. నిరుడు జగిత్యాల జిల్లాలో ఓ టీచర్ ఏకంగా 20 ఏండ్ల పాటు విధులకు డుమ్మాకొట్టిన ఘటన వెలుగుచూసింది. ఇక 2021లో 153 మంది టీచర్లు ఏడాది నుంచి 8 ఏండ్లు పత్తాలేకుండా పోయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని కొందరు టీచర్లు దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. ఇక మారుమూల ప్రాంతాల్లోని బడుల్లో ఇద్దరు టీచర్లు ఉంటే రోజుకు ఒకరు చొప్పున వంతులేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. తాజా హాజరు విధానంతో ఇలాంటి వాటికి చెక్‌పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. టీచర్ల హాజరు నమోదుకు ఇంత కాలం రిజిష్టర్లు వాడేవారు. కొందరు టీచర్లు విధులకు హాజరుకాకున్న తాపీగా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టేవారు. కానిప్పుడు ఇలాంటివి ఈ విధానంతో కుదరడం కష్టమేనన్న స్పష్టంగా తెలుస్తున్నది.