Hair fall Control# జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి..
Hair fall Control# జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి..
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది.
అందుకే చాలామంది జుట్టు రాలిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బట్టతల ఎందుకు వస్తుంది? జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం..
బట్టతల ( Baldness ) ఎందుకు వస్తుంది?
మానవ జన్యువుల్లోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.
జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి?
నిజానికి బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం. కాకపోతే బట్టతల రావడాన్ని కాస్త జాప్యం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యు సంబంధిత, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా.. కొన్నేండ్ల పాటు బట్టతల రాకుండా జాప్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం..
- పోషకాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే కంటినిండా కునుకు, తగినంత వ్యాయామం చేయడం కూడా అవసరమే. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
- బయటకు వెళ్లినప్పుడు, పొల్యూషన్‌లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్ సాయంతో కవర్ చేసుకోవాలి. తలపై ఎప్పటికప్పుడు పేరుకుపోయిన దుమ్ము వల్ల చుండ్రు తయారవుతుంది. అందువల్ల రెగ్యులర్‌గా షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.
- తల జిడ్డుగా తయారవుతుందని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందడం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- షాంపూలు, కండీషనర్లను ఏవి పడితే అవి వాడకూడదు. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపులు, కండీషనర్లను వినియోగించవద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి. వెంట్రుకలు డ్రైగా ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూలతో తలస్నానం చేయడం మంచిది.
- తలస్నానం చేశాక చిక్కులు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దువ్వెనతో బలంగా జుట్టును లాగుతుంటారు. దీనివల్ల కుదుళ్లు చెడిపోయి బలహీనంగా మారుతాయి. తద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్స్ వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగిస్తే జుట్టు చిట్లిపోతుంది. గడ్డిలా మారి రాలిపోతుంది.