Ghost malls# ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఎందుకు పెరుగుతున్నాయి?
Ghost malls# ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఎందుకు పెరుగుతున్నాయి?
Ghost malls: దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. 2022లో 57గా ఉన్న ఈ సంఖ్య 2023 నాటికి 64కు పెరిగింది. ఇంతకీ ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఎందుకు పెరుగుతున్నాయి?
దేశ ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఏదైనా కొనాలంటే ఎక్కువగా ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు. లేదంటే మెరుగైన షాపింగ్ అనుభూతి కోసం కుటుంబంతో కలిసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న మాల్సు తగిన గిరాకీ ఉండడం లేదు. దీంతో అవి ఘోస్ట్ మాల్సు గా మారిపోతున్నాయి. సాధారణంగా అందుబాటులో మాల్ ప్రాపర్టీలో 40 శాతం ఖాళీగా ఉంటే.. వాటిని ఘోస్ట్ మాల్స్‌గా (Ghost malls) వ్యవహరిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్ 2022 లో 57 ఉండగా 2023 లో 64 కు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈమేరకు 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్, 340 షాపింగ్ సెంటర్లను పరిశీలించాక నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. దేశవ్యాప్తంగా గతేడాది 64 ఘోస్ట్ మాల్స్ వల్ల సుమారు 13.3 మిలియన్ చదరపు అడుగుల లీజు స్థలం నిరుపయోగంగా మారినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 58 శాతం పెరిగినట్లు తెలిపింది. దిల్లీ రాజధాని ప్రాంతంలోనే అత్యధిక ఘోస్ట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, బెంగళూరు ఉన్నాయంది. హైదరాబాద్లో మాత్రం 19 శాతం మేర ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు తగ్గినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్త ట్రెండ్ను పరిశీలించినప్పుడు లక్ష చదరపు అడుగులు లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్లో వేకెన్సీ రేటు 36 శాతంగా ఉండగా.. 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వేకెన్సీ రేటు 5 శాతం మాత్రమేనని నివేదిక తెలియజేస్తోంది. మిడ్ లెవల్ షాపింగ్ మాల్స్ వేకెన్సీ రేటు 15.5 శాతం ఉంటోందని తెలిపింది.
ఈ ఘోస్ట్ మాల్స్ వల్ల రిటైల్ సెక్టార్ కు రూ.6,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్ కు పెద్దగా ఆదరణ ఉండకపోవడం ప్రాపర్టీ యజమానులకు సవాలుగా మారిందని, అద్దె దారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్ ఏ మాల్స్.. వినియోగదారులతో కిటకిటలాడుతుండగా.. గ్రేడ్ సి మాల్స్ ఇలా ఘోస్ట్ సెంటర్లు గా మారుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బాలాజీ పేర్కొన్నారు. కొన్ని చిన్న చిన్న మాల్స్ మూతపడుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ గులాం జియా పేర్కొన్నారు. వినియోగదారుల ప్రవర్తన, మార్కెట్ పరిస్థితులకు ఇకపై రిటైల్ స్పేస్ ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది.