జిపిఎస్ ద్వారా పట్టుబడిన బైక్ దొంగ
ప్యాపిలి, మే 28 (పీపుల్స్ మోటివేషన్):-
ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల చోరీలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు మారు తాళాలతో దొంగిలించుకుపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
ప్యాపిలి పట్టణంలో ఇటీవల వరుస బైక్ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు హుస్సేనాపురం తదితర గ్రామాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల ఇంటి వద్ద ఉంచిన మొపెడును, పల్సర్ వాహనంను ఈ నెల ఇంటి వద్ద పార్క్ చేసిన కేటీఎం బైక్ ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో ఈ నెల 27 న ఇంటి ముందు ఉంచిన బుల్లెట్ వాహనాన్ని అపహారించారు. కానీ ఆ ద్విచక్ర వాహనానికి జిపిఎస్ ట్రాకర్ వుండటంతో వాహన యాజమాని జిపిఎస్ ట్రాకర్ ని పరిశీలించి దొంగ వెళ్లే మార్గం గుండా వెళ్లి దొంగ పెద్ద పప్పూరు అనే గ్రామం వద్ద వున్నాడని తెలుసుకొని చాక చక్యంగా దొంగని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనీ, సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు చేయడానికి జంకుతారని, ఒకవేళ దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాల ఫుటేజీతో దొంగలను పట్టుకోవడం చాలా సులువవుతుందని మండల ప్రజలు కోరుతున్నారు.