ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలు మండిపడుతున్నా అభ్యర్థులు..
ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలు మండిపడుతున్నా అభ్యర్థులు..
సొంత జిల్లాల్లో కేటాయించని పరీక్షా కేంద్రాలు..
ఆప్షన్స్ పరిగణలోకి తీసుకోని అధికారులు..
పరీక్ష కేంద్రాలు దూరంగా కేటాయించడంతో అభ్యర్థుల తీవ్ర ఆందోళన
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
టీఎస్ టెట్-2024 హాల్ టికెట్లు గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా.. ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేట, హైదరాబాద్‌లో, కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు వరంగల్, హైదరాబాద్‌లో, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలో.. ఇలా ఇష్టానుసారంగా పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ.. సొంత జిల్లాలకు చాలా దూరంగా పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష ఫీజు రూ. 1000 తీసుకొని మళ్ళీ ఇప్పుడు పరీక్ష కేంద్రాలు వేరే జిల్లాల్లో ఇవ్వడం సరికాదని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
ఇక టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.