బంగారం హాల్ మార్కింగ్ ను ఎలా చెక్ చేయాలో తెలుసా? పూర్తి వివరాలు..
బంగారం హాల్ మార్కింగ్ ను ఎలా చెక్ చేయాలో తెలుసా? పూర్తి వివరాలు..
అక్షయ తృతీయ.. అంటే వెంటనే గుర్తుకొచ్చేది బంగారం. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఏ నగల దుకాణం చూసినా బంగారంపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంటాయి. ఒకవేళ ఈ ఏడాది అక్షయ తృతీయకు (మే 10) బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే బంగారం నాణ్యతను గుర్తించండిలా..
BIS స్టాండర్డ్ మార్క్..
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటుచేసింది. దేశంలో బంగారు ఆభరణాల హాల్మార్కింగ్ను ఇదే రూపొందిస్తుంది. ఈ మార్క్ ఆధారంగానే బంగారం స్వచ్ఛమైనదిగా నిర్ధరిస్తాం. 2021లోనే బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ నగల వ్యాపారి 6 అంకెల హాల్మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ ఉంటేనే ఆభరణాలు విక్రయించాలని పేర్కొంది. హాల్మార్క్ గుర్తులో మూడు విషయాలను ముందుగా తనిఖీ చేయాలి.
త్రిభుజాకారంలో ఉండే BIS లోగో బంగారు ఆభరణంపై ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ లోగోనే ఆభరణాలపై హాల్మార్క్ కి మొదటి సంకేతం.
బంగారు స్వచ్ఛతను ఎలా కొలుస్తారు..!
బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని స్వచ్ఛత. ఈ లోహం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారుచేయడం సాధ్యం కాదు కాబట్టి ఇతర లోహాలను వాడుతారు. ఈ లోహాలు ఎంతవరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. బీఐఎస్ వెబ్సైట్ ప్రకారం.. బంగారు స్వచ్ఛతను 14K, 18K, 20K, 22K, 23к, 24к.. ఇలా ఆరు రకాలుగా వర్గీకరించారు.
బంగారం ఎంత శాతం..!
22KT బంగారు ఆభరణాల్లో 91.6 శాతం బంగారం ఉంటుంది. అదే 18KTలో అయితే 75 శాతం బంగారం ఉంటుంది. ఇక ఆభరణాలపై హాల్మార్క్ 22K916, 18K750, 14K585.. ఇలా ఉంటాయి. మీరు కొనుగోలు చేసిన జ్యూవెలరీపై 22K916 ముద్ర ఉంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం ఇతర మెటల్ ఉంటుంది. అలానే 18K750 అని ఉంటే 75 శాతం బంగారం ఉందని, 14K585 అని ఉంటే 58.5 శాతం మాత్రమే బంగారం ఉందని అర్థం.
6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే..!
అన్ని బంగారు ఆభరణాలకు ఆరు అంకెల ఆల్ఫా న్యూమరికల్ హెచ్ఐయూఐడీ (HUID) కోడ్ ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రతీ ఆభరణానికీ ఒక HUID నంబర్ కేటాయిస్తారు. ఈ కోడ్ ప్రతీదానికి భిన్నంగా ఉంటుంది. BIS కేర్ యాప్ని ఉపయోగించి ఈ కోడ్ సాయంతో మీ బంగారం స్వచ్ఛమైనదో కాదో మీరే స్వయంగా తనిఖీ చేయొచ్చు.