ఆ సమయంలో అది చాలా ముఖ్యం..
స్త్రీలలో రుతుచక్రం మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. అయితే ఆడపిల్లలకు ఏ వయసులో అయినా నెలసరి మొదలవవచ్చు. కాబట్టి దీని గురించి వారికి పూర్తి అవగాహన ఉండటం అవసరం. అందుకే తల్లి తన పిల్లలతో ఈ విషయాల కోసం ముందుగానే మాట్లాడాలి. అలాగే నెలసరి సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాల గురించి వివరించాలి. నెలసరి వచ్చే రెండు మూడు రోజుల ముందు నుంచే ఇబ్బందులు మొదలైపోతాయి. నడుము, కాళ్ళు నొప్పులు, కడుపులో నొప్పి ఉంటుంది. తిమ్మిరి నుంచి మూడ్ స్వింగ్స్ వరకు ప్రతి నెల ఐదు నుంచి ఏడు రోజుల పాటు మహిళలు ఈ బాధలు ఎదుర్కోవాల్సిందే. వీటి నుంచి బయట పడేందుకు కొంతమంది మందులు తీసుకుంటారు. మరికొందరు ఆహారాన్ని మార్చుకుంటారు. అయితే పీరియడ్స్ టైమ్లో ప్రతీ స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన విషయం ఏమిటంటే పరిశుభ్రత. సాధారణంగా స్త్రీలకు పీరియడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని 'మెన్స్ట్రువల్ హైజీన్ డే'గా పాటిస్తున్నారు.
నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. శానిటరీ ఉత్పత్తులను (ప్యాడ్లు, కప్పులు లేదా టాంపాన్లు) మార్చడానికి ముందు, తర్వాత తరచుగా మీ చేతులను కడగండి. ఇది జెర్మ్స్, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. అలాగే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వీలైనంత వరకూ ఆ సమయంలో ఎటువంటి రసాయనాలు వాడకుండా జాగ్రత్త పడాలి. ప్రతి 4-6 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చాలని గుర్తించుకోండి. మెన్స్ట్రువల్ కప్లు, పీరియడ్ అండర్వేర్ వంటి ఉత్పత్తులను ప్రతి ఉపయోగం తర్వాత కడగడం, శుభ్రపరచడం చాలా అవసరం. ఇంకా పీరియడ్ సమయంలో తేలికపాటి, కాటన్ లోదుస్తులు ధరించండి. అలాగే, హైడ్రేటెడ్గా ఉండడం, ఆరోగ్యంగా తినడం కూడా అంతే ముఖ్యం. కొంతమంది ఈ సమయంలో కృత్రిమ సువాసనలు అందించే రసాయనాలు వాడుతుంటారు. వీటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
"అలాగే రసాయనాలు ఎక్కువగా ఉన్న క్లీనింగ్ ప్రొడక్ట్ వాడటం వల్ల అవి మీ సహజ పీహెచ్ స్థాయులను దెబ్బతీస్తాయి."
ఈస్ట్ ఇన్ఫెక్షన్
ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది కాండిడా అల్ట్బికాన్స్ వల్ల కలిగే ఫంగల్ వ్యాధి. వజైనాలోని మంచి బ్యాక్టీరియాని దాటుకుని ఫంగస్ దాడి చేసి రోగాలను వృద్ధి చేసే జీవులను పెంచుతుంది. అనారోగ్యకరమైన రుతు పరిశుభ్రత పాటిస్తే ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్
చాలా మంది మహిళలు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వజైనాలో దురద, చికాకు, వైట్ డిశ్ఛార్జ్, కొన్ని సార్లు మంట వంటి లక్షణాలు ఉంటాయి. శానిటరీ న్యాప్కిన్స్ ఎప్పటికప్పుడు మార్చకపోవడం లేదా మురికిగా ఉన్న న్యాప్కిన్స్ ఉపయోగించడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
అంటువ్యాధిలో అత్యంత సాధారణ రకం. రుతుస్రావం వయస్సులో ఉన్న బాలికలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది అవయవాల వైఫల్యానికి దారి తీసే అవకాశాలని పెంచుతుంది. అపరిశుభ్రమైన పద్ధతుల కారణంగా ఇది ఎక్కువగా వస్తుంది.
బ్యాక్టీరియల్ వాజినోసిస్
యోని స్రావాల pH బ్యాలెన్స్లోలో మార్పులు చోటు చేసుకుంటాయి. రుతు పరిశుభ్రత పాటించకపోతే అధిక pH స్థాయి అనారోగ్యకరమైన బ్యాక్టీరియా సంతానోత్పత్తికి అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. వజైనాలో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. దాని వల్ల వాజినోసిస్కు కారణమవుతుంది. పీరియడ్స్ సమయంలో రోజుకు రెండు సార్లు మామూలు నీళ్లతో వజైనా శుభ్రపరుచుకుంటే చాలు. అలాగే ఎప్పుడూ ముందు నుంచి వెనకకు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనక నుంచి ముందుకు శుభ్రం చేస్తే వేరే ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. మెన్స్ట్రువల్ కప్పులను శుభ్రం చేసేటపుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెన్ స్ట్రువల్ కప్పులను వేడి నీటిలో 50 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత తీసి పొడి గుడ్డతో తుడవాలి.
శ్యానిటరీ న్యాప్కిన్ ఎక్కువ సేపు మార్చకుండా ఉంచుకుంటే దురద, ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు దురద వస్తే క్రమంగా చర్మం ఎరుపెక్కడం, నొప్పి మొదలవుతాయి. అందుకే ఎక్కువగా పీల్చుకునే తత్వం, గాలి ప్రసరణ ఉన్న శ్యానిటరీ ఉత్పత్తుల్ని వాడాలి. రోజుకు రెండు నుంచి మూడు సార్లు గోరువెచ్చని నీళ్లతో వజైనా ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. లేదంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో సంతానోత్పత్తి మీద ప్రభావం పడుతుంది. మీ నెలసరి సమయంలో ఏదైనా మార్పు కనిపిస్తే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నొప్పి, రక్తస్రావంలో మార్పులు, లేదా డిశ్చార్జిలో మార్పులను గమనించాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. బ్లీడింగ్ బాగా అయ్యే రోజులతో పాటు, తక్కువగా అవుతున్న రోజుల్లోనూ తరచూ న్యాప్ కిన్లు మార్చుకోవాలి. కప్ అయినా, ట్యాంపూన్లు అయినా.. ఇలాగే చేయాలి.
రక్తస్రావం తక్కువ అవుతుంది కదా అనే కారణంతో.. గంటల తర్వాత కూడా ప్యాడ్ మార్చకపోతే ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.