డోన్ లో ఓటర్లు మార్పు కోరుతున్నారా?
డోన్ లో ఓటర్లు మార్పు కోరుతున్నారా?
ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా ?
అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా ..? పోలింగ్ లో ఎవరికి అనుకూలంగా ఉన్నారో..
వైసిపి కి హ్యాండ్ ఇచ్చిందెవరు కూటమి కి మద్దతు ఇచ్చిందెవరు..!
మూడు మండలాలలో ఓటర్ మద్దతు ఎవరికి పలికారో..
డోన్ (పీపుల్స్ మోటివేషన్):-
సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ డోన్ నియోజకవర్గంలో ఎవరికి అనుకూలం ..... అంటూ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలలో ఉత్కంఠతో పాటు సామాన్య ప్రజలు కూడా సమాలోచనాలతో జోరుగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా మూడు మండలాలలో జరిగిన పోలింగ్ శాతం పెరగటంతో ఇప్పుడు ఒకటే చర్చ... వ్యతిరేక పవనాలా లేక అనుకూల పవనాలా అంటూనే... అయితే ఈ సారి మాత్రం డోన్ నియోజకవర్గం లో మార్పు తప్పదని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ మండలాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. వైసిపి తరుపున ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన, కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్ పి కోట్ల ప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు. సైకిల్ స్పీడ్ పెంచనున్నారా లేక ఫ్యాన్ వేగం పెంచనున్నారా అన్నది తేలేందుకు జూన్ 4 వరకు వేచి చూడవలసిందే. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే మార్పు తప్పదనే పలువురి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసిపికి హ్యాండ్ ఇచ్చిందెవరు..? ఫ్యాన్ వేగానికి అడ్డు పడిందెవరు?
డోన్ నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పలువురు మనస్తాపంతో వైసీపీకి హ్యాండ్ ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని మూడు మండలాలలో అధిక ఓటు బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గం, వైశ్య సామజిక వర్గం వైసీపీకి బలమైన శక్తిగా ఎప్పుడూ అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ వచ్చింది. అయితే గత ఐదేళ్లలో ప్రతి మండలంలోని ఎదురు ప్రశ్నించని కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన వారికి అందుబాటులో ఉండక ఆశించిన వారికి ఎటువంటి న్యాయం చేయకపోవడం, చుట్టూ ఉన్న వారిని తప్ప మిగిలిన వారిని విస్మరించడంతో, కుల సంఘాల నాయకులు కొందరు సంఘీయులకే కొమ్ము కాస్తూ మిగిలిన సంఘీయులను విస్మరిస్తూ తాము మాత్రమే గొప్ప అని చెప్పుకుంటూ ఉండటంతో ఈసారి ఎన్నికల్లో పలువురు కాపు, వైశ్య, బి సి,సామాజిక వర్గం నేతలు, ఇతర అసమ్మతి నేతలు మనస్తాపంతో ప్రచారానికి దూరంగా ఉండడం, క్యాడరుకు మీ ఇష్టం అని చెప్పడంతో వైసిపి కి మాత్రం భారీగానే నష్టం చేకూరే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా గతంలో ఎవరి బలం అయితే వైసీపీకి అండగా నిలిచిందో అదే బలం ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి గెలుపు పై అనుమానాలు రేకెత్తేలా చేసింది.
టిడిపి ఇన్చార్జిగా ఉన్న ధర్మారం సుబ్బారెడ్డిని మారుస్తూ కోట్లను అభ్యర్థిగా ప్రకటిస్తూ బాధ్యతలు ఇవ్వటంతో పలువురు వారి వర్గీయులు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాలతో కాంగ్రెస్ పార్టీలో పలువురి తో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో వర్గం పెరిగిందని ఆ వర్గమే నేడు ఆశావాహికగా మార్పు తెస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలలో ఎవరు ఎక్కడ వైసీపీకి హ్యాండ్ ఇచ్చి, కూటమికి మద్దతు పలికారు స్పష్టంగా తెలిసిపోతుంది.
మూడు మండలాలలోనూ ఎవరికి మెజార్టీ.?
డోన్ నియోజకవర్గంలోని మూడు మండలాలలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని అందరూ లెక్కలు కడుతున్నారు. ప్యాపిలి మండలం లో టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తుందని, అలాగే ప్యాపిలి మండలంలో కూడా మంచి మెజార్టీ వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక డోన్ అర్బన్ లో నువ్వా నేనా అనేలా ఎన్నికలు జరిగినా టీడీపీ కే మెజార్టీ వస్తుందని, టిడిపి నాయకుల కృషితో ఇక్కడ మెజార్టీ కచ్చితంగా వస్తుందని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి కంచుకోటలైన డోన్, బేతంచెర్ల మండలాలలో ఈసారి వైకాపాకు గత ఎన్నికల్లో వచ్చినట్లు భారీ మెజార్టీ సాధ్యం కాదని, ముఖ్యంగా ప్యాపిలి మండలంలో కూటమి భారీగా బలపడడం, అందుకు అనుగుణంగా చాలామంది వైకాపా నాయకులు అంటీ ముట్టినట్లు వ్యవహరించడంతో ప్యాపిలి మండలంలో ఈసారి హెరాహెూరి తప్పదని పలు వురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక డోన్ రూరల్ కూడా నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు జరిగినా వైసీపీకి స్వల్ప మెజార్టీ వస్తుంది కానీ గత వైభవం మాత్రం దక్కదని పలువురు చర్చించుకుంటున్నారు. మరి ఈ మూడు మండలాల లెక్కలను, ఓటర్ల అభిప్రాయాలను, నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఈసారి డోన్ నియోజకవర్గంలో మార్పు ఖాయమని సంకేతాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకొని అలాగే 40 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదని ఒక బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రమే అభివృద్ధి చేశాడని ఎన్నికల బరిలోకి దిగిన వైకాపాకు సంక్షేమ పథకాల లబ్దిదారులు మద్దతు ఇచ్చారో లేక కూటమి వైపు మొగ్గు చూపారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండవలసిందే. మరి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఓటర్ దేవుళ్ల ఆశీర్వాదం ఎవరికి దక్కిందో ఇప్పటికే చాలామంది నాయకులకు స్పష్టమైన సమాచారం ఉన్న లెక్కలతో సహా బయటపడాలంటే మూడు వారాలు ఆగాల్సిందే. మరి జూన్ 4వ తేదీ సైకిల్ స్పీడా లేక ఫ్యాన్ జోరు డోన్ లో కొనసాగుతుందో వేచి చూద్దాం.