ర్యాగింగ్ ను అరికట్టండి...
ర్యాగింగ్ ను అరికట్టండి...
కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు
యాంటీ ర్యాగింగ్ వర్క్ షాప్ లు, సెమినార్లు నిర్వహించాలి
రాష్ట్రాలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ
జిల్లా స్థాయి యాంటీ ర్యాగింగ్ కమిటీల ఏర్పాటుకు ఆదేశం
ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగు ఎలా నిరోధించాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాగింగ్ పై చర్యలు తీసుకోకపోయినా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనా ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల సీఎస్ లకు పంపిన లేఖల్లో జిల్లా స్థాయి ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీకి కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజిస్ట్రేట్ అధిపతిగా ఉండాలని, సభ్యులుగా వర్సిటీ/కళాశాల అధిపతులు, ఎస్పీ/ఎస్ఎస్పీను నియమించాలని పేర్కొంది. మెంబర్ సెక్రటరీగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉంటారని, కమిటీలో మీడియా ప్రతినిధులు, జిల్లాస్థాయి ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పోలీసులు, స్థానిక పరిపాలనతో పాటు సంస్థాగత అధికారులు ఉండాలని సూచించింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, యాంటీ ర్యాగింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కీలక ప్రదేశాల్లో సీసీటీవీ లను అమర్చాలని చెప్పింది. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తూ యాంటీ ర్యాగింగ్ వర్క్ షాప్ లు, సెమినార్లు నిర్వహించాలని కోరింది. వర్సిటీ లు/విద్యా సంస్థల్లోని ముఖ్య ప్రదేశాల్లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను ప్రదర్శించాలని వీటిని యూజీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ర్యాగింగ్ బాధితులు హెల్ప్ లైన్ 1800-180-5522 కు కాల్ చేయవచ్చని లేదా helpline @antiragging.inకు మెయిల్ చేసి సహాయాన్ని కోరవచ్చని పేర్కొంది.