-Advertisement-

ఇంట్లో వేడిగా ఉందా..ఎండలకు చల్లగా మార్చేదెలా..?

roof cooling techniques roof cooling sheet roof cooling techniques in india House roof cooling price how to reduce heat from concrete roof india roof
Peoples Motivation

ఇంట్లో వేడిగా ఉందా..ఎండలకు చల్లగా మార్చేదెలా..?

roof cooling techniques roof cooling sheet roof cooling techniques in india House roof cooling price how to reduce heat from concrete roof india roof
వేసవి వచ్చేసింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కూడా అధిక ఉష్ణోగ్రతలకు ఓ కారణం. పట్టణాల్లో అయితే ఇంకా ఎక్కువ వేడి పరిస్థితులు ఉంటాయి. ఫలితంగా వేడి గాలులు వస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కావాల్సిందే. దీంతో విద్యుత్కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇదివరకు శ్లాబ్ల వరకే కాంక్రీట్ వినియోగించేవారు. ఇప్పుడు మైవాన్ టెక్నాలజీలో గోడలు సైతం కాంక్రీట్తోనే కడుతున్నారు. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. వీటితో సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఇళ్లలో వేడి అధికంగా ఉంటుంది. పై అంతస్తుల్లో ఉన్నవారికి మరీ అధికం. ఇండిపెండెంట్ హౌసుల్లో శ్లాబుల నుంచి అధిక వేడి ఇళ్లలోకి చేరుతుంది. ప్రతి గదిలో కూలర్లు, ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితి. నిర్మాణ సమయంలో కొన్ని జాగ్రత్తలతో అధిక వేడి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా నిరోధించవచ్చు. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇంటి పైకప్పు చల్లగా...

కాంక్రీట్ నిర్మాణాలు ఎండ వేడిని తీసుకుంటున్నాయి కానీ పరావర్తనం చేయడం లేదు. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కూల్ రూఫ్ విధానంతో వేడిని తగ్గించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెబుతున్నారు. రెగ్యులర్ సంప్రదాయ పైకప్పులు వాటిపై పడే సూర్యకిరణాలలో 20 శాతం వరకు పరావర్తనం చేయగలుగుతాయి. అదే కూల్ రూఫ్ విధానంతో నిర్మించిన పైకప్పులు 80 శాతం వరకు సూర్యకాంతిని పరావర్తనం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక రసాయనాలు, పైకప్పు ఉపయోగించే సామగ్రిలో మార్పులతో దాదాపు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని అంచనా. నిర్మాణంలో ఉన్న భవనాలకు ఆధునిక సాంకేతికత ద్వారా పైకప్పు నిర్మాణ సమయంలో ప్రత్యేక రసాయనాలు వాడటం ద్వారా సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయి. ఫలితంగా వేడి తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. ఇది పర్యావరణహితమైనది. మన దేశంలో 6 శాతం మంది ప్రజలు ఏసీలు వాడుతున్నారని మరో పదేళ్లలో ఇది 20 రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పాతరోజుల్లో శ్లాబుపైన సున్నం వేసేవారు. వర్షం పడితే ఇది పోతుండడంతో ఇప్పుడు కూల్రూఫ్ పెయింట్స్ వచ్చాయి. వర్షం పడినా కొట్టుకుపోకుండా ఉండే వాటర్ ప్రూఫ్ రంగులివి. ఆరేళ్ల వరకు పనిచేస్తాయి. దీనివల్ల గది లోపలి ఉష్ణోగ్రత 5-8 డిగ్రీలు, పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత 15-18 డిగ్రీలు తగ్గుతుంది. మోజాయిక్ టైల్సు సైతం శ్లాబుపై వేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఎన్నో రంగులు, డిజైన్లలో లభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఇంటిలోపల 4 డిగ్రీల వరకు తగ్గుతాయి. రూఫ్ గార్డెన్, సోలార్ రూఫ్ టాప్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి. చలువ పైకప్పులు ఉంటే పైన ఉండే ఉష్ణోగ్రతలు గదిలోకి వచ్చేసరికి 20 డిగ్రీల వరకు తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో తెలుపు రంగు ప్లాస్టిక్ కవర్లను రేకుల ఇళ్లపై పరచడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు. మెంబ్రెన్ టెక్నాలజీతో వస్తున్న షీట్స్ను కూల్రూఫ్స్ వినియోగించుకోవచ్చు. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో అన్ని ఇళ్లపైనా కూల్రూఫ్స్ వేసుకుంటే ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంతేకాకుండా నగరాలు, పట్టణాల్లో ఆరు వందల చదరపు గజాలు అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాలు కూల్ రూఫ్ ని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి నిర్మాణాలకు మాత్రమే నివాస వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) జారీ చేస్తారు.

పైకప్పుపై టైల్స్ వేసుకుంటే సుమారు 25 ఏళ్ల పాటు మన్నుతాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలతోపాటు పాత వాటికి సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. సామాన్యులకూ అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ విధానం వల్ల పర్యావరణానికీ మేలు చేకూరుతుంది. వేసవిలోనే కాకుండా శీతాకాలంలో సైతం బయటి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉష్ణోగ్రతను తగ్గించాలంటే కూల్రూఫ్ టైల్స్ నిర్వహణలో కొన్ని చిట్కాలు పాటించాలి. పైకప్పుపై పేరుకుపోయే వ్యర్థాలు, శిథిలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. టైల్స్ నాచు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిర్వహణ బాగుంటే వీటి మన్నిక పెరుగుతుంది.

ఇంటి నిర్మాణ సమయంలో..

ఇళ్ల నిర్మాణ సమయంలోనే హరిత భవనాలను నిర్మించుకోగలిగితే వేసవిలో అధిక వేడి సమస్యలను నివారించవచ్చు. నిబంధనల మేరకు సెట్బ్యాక్ వదిలి గాలి, వెలుతురు ఇళ్లలోకి వచ్చేలా ఇంటి డిజైన్ ఉండాలి. ఆవరణలో మొక్కలు, పచ్చదనంతో నేరుగా వేడి ఇళ్లలోకి పడకుండా ఉంటుంది. స్థలాభావం ఉన్న ఇళ్లలో మేడపైన పెంచుకోవచ్చు. సాధారణ ఇటుకల స్థానంలో ఏఏసీ, ఫ్లైయాష్ ఇటుకలు వాడాలి. క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి. వేడి లోపలికి రాకుండా డబుల్ గ్లేజర్స్ ఉపయోగించాలి.

మొక్కలకు నీడ..

వేసవికాలం రాగానే మొక్కల పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా పెరట్లోని మొక్కలకు ఎంత నీరందించినా అవి ఎండిపోతాయి. అలా కాకుండా ఉండటానికి కొన్ని సలహాలు ఇస్తున్నారు గార్డెనింగ్ నిపుణులు. మొక్కలకు కాస్త నీడను ఏర్పాటు చేస్తే మంచిది. నర్సరీలకు ఉపయోగించే పలుచని నెట్తో గార్డెన్ చుట్టూ, పై భాగంలో కూడా నీడను ఏర్పాటు చేస్తే సూర్యుడి నుంచి వచ్చే ఎండ నేరుగా పడకుండా ఉంటుంది. ఈ తెరలు ఆన్లైన్లో, నర్సరీ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. వేసవిలో నేల ఎక్కువగా పొడిబారి నెర్రలు ఇస్తుంది. అలా కాకుండా ఉండాలంటే తోటలోని మట్టి తేమగా ఉండేలా నీటిని అందించాలి. నీళ్లు కొద్ది కొద్దిగా మొక్కలకు అందేలా మొదళ్లలో పాదులు చేసి నీటిని నింపాలి. మొక్కల ప్రూనింగ్ ఈ కాలంలో చేయకపోవడమే మంచిది. పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలకు నీడను ఇస్తాయి. కాబట్టి వాటిని నాటుకోవాలి. మొక్కలకు నీరు ఎంత అవసరమో ఎరువులు కూడా అంతే అవసరం. ఇంట్లో తయారు చేసిన వర్మీ కంపోస్టు, మార్కెట్లో దొరికే సహజ ఎరువులను కూడా ఉపయోగించొచ్చు. అవి మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి.

జాగ్రత్తలు కూడా ముఖ్యమే..

ఇల్లు అందంగా కన్పించేందుకు ఎన్నో హంగులు అద్దుతున్న గృహ యజమానులు భద్రతాపరంగా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నగరంలో ఏ ఇల్లు, ఫ్లాట్ చూసినా బాల్కనీలు కన్పిస్తుంటాయి. వీటికి రెయిలింగ్స్ అందంగా, వినూత్నంగా ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తున్నారు. కానీ ఇవి భద్రంగా ఉన్నాయా లేదా చూడట్లేదు. వ్యక్తిగత ఇళ్లలో నిర్మించే బాల్కనీ రెయిలింగ్లు తక్కువ ఎత్తుతో ప్రమాదకరంగా ఉంటున్నాయి. అపార్ట్మెంట్లలోనూ కొందరు తక్కువ ఎత్తులో రెయిలింగ్స్, బాల్కనీలు నిర్మిస్తున్నారు. బాల్కనీ, మెట్ల రెయిలింగ్ ఎత్తు తగినంత లేకపోవడం, పిట్టగోడ ఎత్తు ప్రమాణాల మేరకు కట్టకపోవడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. భవనాల ఎత్తును బట్టి కూడా బాల్కనీ రెయిలింగ్ ఎత్తు మారుతుంది. ఎత్తు పెరిగినప్పుడు సహజంగానే బాల్కనీ రెయిలింగ్ ఎత్తు కూడా పెరగాలి. బాల్కనీలో నిలబడితే రెయిలింగ్ ఎత్తు మోచేతుల వరకు ఉండేలా చూసుకుంటే చాలా సురక్షితం అని బిల్డర్లు చెబుతున్నారు. అన్నిటికన్నా కాంక్రీట్ రెయిలింగ్లు పూర్తి సురక్షితం. మెటల్ గ్రిల్స్.. లేదంటే కాంక్రీట్, మెటల్ గ్రిల్స్ రెండూ కలిపి ఏర్పాటుచేసుకోవచ్చు. గాజు, మెటల్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లయితే కడ్డీల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం లేకుండా చూడాలి. డిజైన్లు పిల్లలు ఎక్కేందుకు వీలుగా లేకుండా చూడాలి.

జిప్సం కాంక్రీటుతో ప్లాస్టరింగ్

ఇంటి నిర్మాణంలోనూ టెక్నాలజీ ప్రవేశించింది. అనేక రకాల కొత్త పోకడల్ని బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఈ జిప్సం ప్లాస్టరింగ్ ఒకటి. లోపల గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ స్థానంలో జిప్సం వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. నది ఇసుక కొరత కారణంగా జిప్సం వైపు మొగ్గుచూపుతున్నారు. గట్టిదనానికి డోకా ఉండదని, పగుళ్లు రావని, సమయమూ కలిసి వస్తుందని నిర్మాణదారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణంలో స్తంభాలు, శ్లాబుల పనులు పూర్తయినా గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్, క్యూరింగ్కు చాలా సమయం పడుతుంది. అందుకే జిప్సంవైపు మొగ్గు చూపుతున్నారు. మినరల్ జిప్సం సన్నని పొడి మాదిరి 74 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. ఇంటిలోపలి గోడలకు ఇసుకతో చేసే ప్లాస్టరింగ్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇసుక, సిమెంట్ సమపాళ్లలో వాడకపోవడం, వీటిలో నాణ్యత లోపించడం, సరిగా క్యూరింగ్ చేయకపోవడంతో గోడలకు పగుళ్లు ఎక్కువగా వస్తున్నాయి. జిప్సంతో ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు బిల్డర్లు. ప్రపంచవ్యాప్తంగా జిప్సం కాంక్రీటు మార్కెట్ వార్షికంగా ఎనిమిది శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లాట్లన్నీ దగ్గరగా ఉండటం వల్ల శబ్ద కాలుష్యం, వేడిని నివారించే నిర్మాణ సామగ్రిని వినియోగించాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి జిప్సం బోర్డు సరిపోతుంది.

ప్రయోజనాలు

  • సిమెంట్ ప్లాస్టరింగ్ కు 15 రోజులు పడితే జిప్సంతో వారం రోజుల్లోనే చేయొచ్చు.
  • జిప్సంతో చేస్తే క్యూరింగ్ అవసరం లేదు.
  • సిమెంట్తో ఎక్కువ మందం చేయలేం. పగుళ్లు వస్తాయి. పైగా
  • రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. మొదట దొడ్డు ఇసుకతో దుబారా చేస్తారు. ఆ తర్వాత సన్న ఇసుకతో చేస్తారు. జిప్సంతో ఒకేసారి ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు.
  • సిమెంట్ ఇటుకలకైతే 8-12 ఎంఎం మందం, మట్టి ఇటుకలకు 12-15 ఎంఎం మందం వరకు చేసుకోవచ్చు.
  • 25 కిలోల బస్తా 20 చదరపు అడుగులకు సరిపోతుంది.
  • ఉష్ణోగ్రతలను నిరోధిస్తుంది కాబట్టి బయటి కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువే ఉంటుంది.
  • ఇంటిలోపల చూడటానికి చాలా విశాలంగా, అందంగా కన్పిస్తుంది.

జిప్సం తయారీకి కావాల్సిన కాల్షియం సల్ఫేట్ను ఇరాన్, ఒమన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సిమెంట్ ప్లాస్టరింగ్ మాదిరే గట్టిదనం ఎక్కువే. ఇటుకలకు ఒకసారి పడితే వదలదు. ఊడిపోవడం, పగుళ్లు వంటి సమస్యలు రావు. కొన్ని సంస్థలు ఇప్పటికే గృహ, వాణిజ్య నిర్మాణాల్లో జిప్సంనే ప్లాస్టరింగ్ కు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం బిహార్, ఒడిశా కార్మికులు ఈ పని చేస్తున్నారు.

Comments

-Advertisement-