ఎన్నికల్లో సిరాచుక్క ప్రత్యేకతలు..?
ఎన్నికల్లో సిరాచుక్క ప్రత్యేకతలు..?
ఎన్నికల పోలింగ్లో ప్రతిఒక్కరి వేలికీ సిరా చుక్క పెడతారు తెలుసు కదా.. ఎన్నికల్లో ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్ కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. కొన్ని వారాల పాటు చెరిగిపోదు. అసలీ సిరా చుక్క వాడకం తొలిసారి ఎప్పుడు మొదలైంది? సిరా చుక్క ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..?
ఎన్నికల్లో సిరా గుర్తు ఏ వేలుకు పెడతారు.?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు.
అందుకే చెరిగిపోదు..
ఈ సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) అనే కంపెనీ తయారుచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతిచ్చింది. నేషనల్ ఫిజికల్ లేబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ సిరాను సరఫరా చేస్తుంటారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. 2006 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందివరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకన్నా ముందువరకు గోరు పైభాగపు చర్మంపైనే వేసేవారు.
1950 సంవత్సరంలోనే పేటెంట్..
అసలు ఓటర్లకు సిరా వేసే విధానం చాలాకాలం పాటు లేదు. 1950లోనే ఈ సిరా పేటెంట్ను భారత్లోని నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NRDC) పొందింది. ఆ తర్వాత సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కి చెందిన నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) ఈ సిరాను అభివృద్ధి చేసింది. అనంతరం దీన్ని మైసూర్లోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) అనే చిన్న కంపెనీకి ఉత్పత్తికి అనుమతించింది. ఈ కంపెనీని 1937లో మైసూర్ మహారాజు కృష్ణరాజ వడియార్ IV స్థాపించారు. ఈ కంపెనీ భారత్లో 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల సమయంలో తొలిసారి ఈ సిరాను మైసూరు ప్రాంతంలోనే వాడారు. అప్పటినుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్లో వాడుతున్నారు.
5 mm వయల్.. 300 మందికి..
ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం మన ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఆర్డర్ ఇస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఈసారి దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతో ఎన్నికల కోసం 30 లక్షల సిరా వయల్స్ అవసరం. దీనికోసం రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 5 మిల్లీలీటర్ల వయల్ 300 మందికి సరిపోతుందట.
తయారీలో ప్రత్యేకతలు.!
ఈ ప్రత్యేక సిరా తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారట. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు సైతం తెలియకుండా గోప్యత పాటిస్తారు. ఆ సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్లకు తప్ప ఇంకెవరికీ ఈ తయారీ విధానం తెలియదట. వాళ్లు అందుబాటులో లేని అనివార్య పరిస్థితుల్లో నమ్మకస్తులైన తమ తర్వాత ఉద్యోగులకు మాత్రమే ఈ ఫార్ములాను సదరు కెమిస్ట్లు బదిలీ చేస్తారని సమాచారం.
మన సిరా 29 దేశాలకు సరఫరా..
దేశీయంగా తయారవుతున్న సిరాకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికలకు సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి " మొత్తంగా దాదాపు 29 దేశాలకు ఇక్కడినుంచే ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టర్కీ, ఈజిప్టు తదితర దేశాల్లో ఎన్నికల సమయంలో ఈ సిరాను వినియోగిస్తున్నారు.