ముందు జాగ్రత్తలే మేలు..
ముందు జాగ్రత్తలే మేలు..
• అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన ముఖ్యం
హైదరాబాద్, మే 14(పీపుల్స్ మోటివేషన్):-
వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. దీనికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఒక కారణమైతే.. అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నా సమాచారం ఇవ్వడంలో ఆలస్యం కారణంగా మవడం భారీ నష్టం సంభవిస్తోంది. గోదాములు, నివాస గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, చిన్న పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, గోదాములు, తాత్కాలిక పందిర్లలో ఎక్కువ ప్రమాదాలు విద్యుదాఘాతంతో జరిగే అవకాశం ఉంది. పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుని, అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలన్నారు. అధిక విద్యుత్తు వాడుతున్న పరిశ్రమలు వందల్లోనే ఉన్నాయి. వేసవిలో పరిశ్రమల్లో అజాగ్రత్త వహిస్తే భారీగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలో మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడితే ప్రమాదాన్ని అరికట్టే అవకాశం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అన్నారు. ఈ వేసవిలో ఆయా సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకరమైన వస్తువులు, రసాయనాలు, త్వరగా మండే స్వభావం ఉన్న పరిశ్రమలు తప్పని సరిగా జనావాసాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే స్థాపించాలి. పరిశ్రమల్లో యంత్రాలకు, సరకు, ముడి సరకు నిల్వలను వేర్వేరు గదుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు అగ్ని కీలలు పరిశ్రమ మొత్తం వ్యాపించక ముందే పొగను గుర్తించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. నిప్పును గుర్తించగానే ఇతర కార్మికులను హెచ్చరించేందుకు అలారం అందుబాటులో ఉంది. పరిశ్రమలో కప్పుల నుంచి నీటి జల్లులు కురిపించే పరికరాలు లభిస్తున్నాయి. వీటితో పాటు అత్యాధునిక సాంకేతిక సాధనాలతో ప్రమాదాలను అరికట్టవచ్చిన అన్నారు. ఆయా పరిశ్రమలు లేదా సంస్థలు ఎండా కాలంలో ప్రమాదాల నివారణకు తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.