అసలు ఒక్క ఓటు విలువ తెలుసా..!
అసలు ఒక్క ఓటు విలువ తెలుసా..!
'ఒక్క ఓటు' విలువ తెలియకపోవడమే దీనికి కారణం. ఈ ఒక్క ఓటు కారణంగానే.. ప్రభుత్వాలే కూలిపోయాయ్..! నేతల తలరాతలే మారిపోయాయ్!! అందులో కొన్ని ఉదాహరణలు మీ ముందుకు..✍️
వాజ్పేయి ని గద్దె దింపిన ఆ ఒక్క ఓటు..
పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తన పదవిని కోల్పోయారు. 1999లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే ఉండేది. ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 1999 ఏప్రిల్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. విపక్షాల్లో ఎవరికీ మెజార్టీ లేకపోవడంతో లోక్సభ రద్దయింది.
డ్రైవర్ కు సమయం ఇవ్వకపోవడంతో...
2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహళ్లి (ఎస్సీ) స్థానంలో జనతాదళ్ (సెక్యులర్) తరఫున ఏఆర్ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తరపున ధ్రువ నారాయణ పోటీ చేశారు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఓటమి చవిచూశారు. అనంతరం ఆయన ఓ పత్రిక ముఖాముఖిలో మాట్లాడుతూ.. తన బద్ధశత్రువు కూడా ఒక్క ఓటుతో ఓడిపోవాలని కోరుకోడని వ్యాఖ్యానించారు. ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్కు ఏఆర్ కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తర్వాత కథనాలు వెలువడ్డాయి.
ఒక్క ఓటుతో సీఎం పీఠం చేజారే...
రాజస్థాన్లో 2008 శాసనసభ ఎన్నికల్లో నాతా ద్వార అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సీపీ జోషి, భాజపా నుంచి కల్యాణ్సింగ్ చౌహాన్ పోటీ చేశారు. ఫలితాల్లో చౌహాన్కు 62,216 ఓట్లు వచ్చాయి. జోషికి 62,215 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. జోషి తల్లి, సోదరి, డ్రైవర్.. ఎన్నికల రోజు ఓట్లు వేయడానికి వెళ్లలేదు. ఈ ముగ్గురూ ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేగా ఉండేది. ఆ ఎన్నికల్లో జోషి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా సీఎం రేసులో ముందున్నారు. పార్టీని విజయపథంలో నడిపించినా ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సీఎం అయ్యే అవకాశాన్నీ కోల్పోయారు.
ఈ మధ్య కాలంలోనే మిజోరంలో మూడు ఓట్ల తేడాతో...
మిజోరంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ (ఎస్టీ) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎల్ పియాన్మావియా మూడు ఓట్లతో ఓడిపోయారు. అక్కడ మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి లాల్చందా రాలేకు 5,207 ఓట్లు రాగా, పియాన్మావియాకు 5,204 ఓట్లు పోలయ్యాయి. రీకౌంటింగ్లోనూ ఎలాంటి మార్పూ లేకపోవడంతో పియాన్మావియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
ప్రపంచంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలు
• 1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 శిరచ్ఛేదనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే...
• 1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.
• 1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికాలో జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.
• 1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది.
• 1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు.
• 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు. లేదంటే ప్రపంచ గతి ఎలా ఉండేదో!