బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నగరవాసుల హర్షం
బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నగరవాసుల హర్షం
తీవ్ర నీటి కొరతతో అల్లాడిన ప్రజలు...
ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజల కేరింతలు
సోషల్ మీడియాతో ఆనందం పంచుకున్న వైనం
బెంగళూరు, (పీపుల్స్ మోటివేషన్):-
గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇటీవలి నీటి కొరతతో నగరవాసులు అల్లాడారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు. కొందరు ఏకంగా అపార్ట్ మెంట్లను ఖాళీ చేయగా మరికొందరు సమీపంలోని మాల్స్ కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘దాదాపు 6 నెలల నిరీక్షణ తర్వాత బెంగళూరులో ఎట్టకేలకు వర్షం కురిసింది. ఎండల వేడి నుంచి ఊరటనిచ్చింది. దీంతో క్యాంపస్ లోని మా వాలంటీర్లు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు. వర్షంలో కేరింతలు కొట్టారు. ప్రకృతి పునరుద్ధరణ సంకేతం ఎంతో ఊరటను, ఆశను కలిగిస్తోంది. ఇక చల్లని రోజులు వస్తాయనే హామీ ఇస్తోంది’ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
కానీ నడివేసవిలో ఉన్నట్టుండి నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 5–6 నెలల తర్వాత బెంగళూరులో శుక్రవారం తొలిసారి వర్షం కురిసింది. దీంతో బెంగళూరువాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎండలు, ఉష్ణోగ్రతల నుంచి ఊరట లభించిందని తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వర్షం ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. మరికొందరేమో వర్షం నీటిని వృథా కానీయకుండా ఇంకుడు గుంతల్లోకి పంపుతున్న వీడియోలను పోస్ట్ చేశారు.