సూర్యుడి భగభగలు.. వందేళ్లనాటి రికార్డును బ్రేక్ చేశాడు!
సూర్యుడి భగభగలు.. వందేళ్లనాటి రికార్డును బ్రేక్ చేశాడు!
ఏప్రిల్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
1921 తర్వాత ఇదే తొలిసారి
మేలో మరింతగా చెలరేగనున్న భానుడు
తూర్పు, దక్షిణ భారతదేశానికి ఐఎండీ హెచ్చరిక
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
సూర్యుడి చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు (45 డిగ్రీలు) నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈసారి మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూరీడు.. రోజురోజుకు మరింతగా మండిపోతున్నాడు. ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారంగా మారిపోయింది. అంతేకాదు, వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తూర్పు, దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది.
తెలంగాణలో సోమవారం ఒక్క రోజే వడదెబ్బతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఎల్లుండి వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని తప్ప బయటకు రావొద్దంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.