ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు ఎందుకు? పరిమితి దాటితే ఎలాంటి చర్యలు ఉంటాయి?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు ఎందుకు? పరిమితి దాటితే ఎలాంటి చర్యలు ఉంటాయి?
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుకు లిమిట్ ఉంది కానీ పార్టీలకు లేదు. 2019 ఎన్నికల్లో BJP ₹1,264 కోట్లు, INC ₹820 కోట్లు వ్యయం చేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి పార్టీలు, అభ్యర్థులు చేసిన ఖర్చు ₹60,000 కోట్లు పైనేనని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్(CMS) నివేదిక వెల్లడించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో అనధికార ఖర్చు ₹1.2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఒక్కో సెగ్మెంట్ సగటు వ్యయం ₹221 కోట్లు.
అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఎందుకు?
ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశం అందరికీ సమానంగా కల్పించాలనే ఉద్దేశంతో వ్యయ పరిమితిని EC విధించింది. 1952 తొలి లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో గరిష్ఠంగా ₹25వేలు, చిన్న రాష్ట్రాల్లో ₹10వేలు. యాడ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, వాహనాల వినియోగం ఇందులోకే వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని EC వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది.
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నివారించలేమా?
ఈసీ నిబంధనల ప్రకారం MP అభ్యర్థి గరిష్ఠంగా ₹95 లక్షలు, MLA అభ్యర్థి ₹40 లక్షలు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఉంది. వాస్తవంగా ఆ ఖర్చు రూ.కోట్లలో ఉంటోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీళ్లలా పారుతోన్న నోట్ల కట్టలు కళ్ల ముందే కనిపిస్తున్నా సరైన చర్యలు ఉండట్లేదు. ఈ విపరీత వ్యయాన్ని నిలుపుదల చేయకపోతే తీవ్ర ప్రమాదమని, గెలిచిన అభ్యర్థుల అవినీతిని పెంచి పోషించడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
వ్యయ పరిమితి దాటితే చర్యలు ఎలా?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.