తొలి సంతకం మెగా డీఎస్సీపైనే..వికలాంగులకు ప్రతి నెలా రూ.6 వేల పెన్షన్
తొలి సంతకం మెగా డీఎస్సీపైనే..వికలాంగులకు ప్రతి నెలా రూ.6 వేల పెన్షన్
సీమకు గోదావరి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తా
నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్
నరరూర రాక్షసులను కాదు...నడిపించే నాయకున్ని ఎన్నుకోండి
నంద్యాల ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
భూమి మనది రా.. ఈ జగన్ ఎవుడురా...అనే పాటను సభలో ప్రజలకు వినిపించిన చంద్రబాబు
నంద్యాల, మే 11 (పీపుల్స్ మోటివేషన్):-
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వికలాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతానని స్పష్టం చేశారు. నంద్యాలలో శనివారం ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘‘ఎండను సైతం లెక్కచేయకుండా ఆడబిడ్డలు, కార్యకర్తలు అందరూ సభకు వచ్చారు. నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తారీఖు గుర్తొస్తుంది. ఇక్కడ లాస్ట్ మీటింగ్ పెట్టి తెల్లవారితే హైదరాబాద్ వెళ్లాలని ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేశాను. రాత్రి ఎవరో వచ్చి నేను ఉన్న బస్సు తలుపు కొట్టారు. ఎవరో దొంగలు వచ్చారనుకున్నా కానీ, దొంగ పోలీసులు వచ్చారు. తెల్లవారు జామున కిందకి వచ్చి ఎందుకొచ్చారయ్యా అని అడిగితే మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చాం అని చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఎక్కడికి పారిపోను నన్ను అరెస్టు చేయాలంటే కారణం ఉండాలిగా. నోటీసు ఇవ్వాలి కదా ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని అడిగాను దానికి వాళ్ల సమాధానం కారులో ఇస్తాం, సాయంత్రం ఇస్తామని చెప్పి నన్ను బలవంతంగా అరెస్టు చేసి అమరావతికి తీసుకెళ్లారు. ఆరోపణలు చెప్పకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉందా? ఇలా చేయడం అన్యాయమా కాదా? తప్పా కాదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. 30 ఏళ్లుగా పార్టీ నడిపాను. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాను. అలాంటి నన్నే మామూలుగా అరెస్టు చేశారంటే మీరు ఒక లెక్కా ఈ సైకో జగన్ కి. గత ఐదేళ్లు ఈ పరిపాలనలో ఇలాగే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల సభలు పూర్తవుతాయి. రేపు ఆగితే ఎల్లుండు సైకో జగన్ ని ఇంటికి పంపే రోజు. సైకోని వదిలించుకోడానికి మీరందరూ సిద్దమా.
నన్ను చంపుతామని బెదిరించారు..
నా మీద ఎన్ని కేసులు పెట్టి అరెస్టు చేసినా నేను భయపడతానా? జైళ్లో నన్ను చంపుతామని బెదిరించారు అయినా నేను భయపడలేదు. నన్ను చంపితే వైసీపీ వాళ్లు ఎవరి మెడకు వారు ఉరేసుకోవాల్సి వస్తుంది. నేనెప్పుడూ ప్రాణానికి భయపడలేదు. మీ ప్రాణాలు, మీ ఆస్తులు కాపాడడానికి లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా నడిపించాను. తిరుపతి దగ్గర 24 క్లేమోవర్ మైన్స్ నామీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు నన్ను ఆ వెంకటేశ్వర స్వామి కాపాడారు. అంత పెద్ద ప్రమాదం నుంచే గెలిచి వచ్చిన నేను ఈ సైకో కి భయపడతానా.
నా శ్వాస ఉన్నంత వరకూ మీకోసమే..
నా శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతికోసం, మీ బిడ్డల భవిష్యత్తుకోసం, పేదవాళ్ల కోసమే పనిచేస్తా. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ది చేసి సంక్షేమాన్ని అందించాలి. హైదరాబాద్ అంత అభివృద్ధి జరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు అక్కడ ఐటీ ఉద్యోగులు ప్రపంచమంతా వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో అద్దంలాంటి నేషనల్ రోడ్లు వచ్చాయంటే దానికి కారణం నేనే. మీరు వాడుతున్న సెల్ ఫోన్లు తీసుకొచ్చాను. సైకో జగన్ తనకి ఫోను లేదు, అడ్రస్ లేదని అబద్దాలు చెప్తున్నాడు. అలాంటి వాడు మిమ్మల్ని ఆదరిస్తాడా. 2014 లో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. హైదరాబాద్ ని అభివృద్ధి చేశా కానీ, ఆరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల చాలా బాధపడ్డాను మీరు కూడా భయపడ్డారు. నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాననే నమ్మకం మాత్రం నాకు ఉంది.
రాజధాని లేని రాష్ట్రం..
రాజధానిగా అమరావతిని ప్లాన్ చేశాను. హైదరాబాద్ కంటే గొప్పగా చేయాలని నిర్ణయించుకుని అమరావతిని రాజధానిగా చేయలనుకున్నాను. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజధాని ఏదంటే మూడుముక్కల తిక్కలోడు మూడు రాజధానులంటూ నాటాకాలాడుతున్నాడు. జగన్ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట ఇడుపులపాయలో తన తండ్రి సమాధి పక్కన చేయమనండి. మనకు రాజధాని లేకుండా నాశనం చేశాడు. గొప్ప రాజధానిని నిర్మించి పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమ కు తెచ్చి బనకచర్లకు అందించాలనుకున్నా కానీ, జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు.
అభివృద్ధికి పునాదులు వేసిన పార్టీ టీడీపీ..
రాష్ట్రంలో అభివృద్ధిని పుంతలు తొక్కించాను. నంద్యాలకు బై ఎలక్షన్ కి వచ్చి రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పాను చేసి చూపించాను. 14,500 టిడ్కో ఇళ్లు కట్టించాను. ఐదేళ్లయినా నేను కట్టిన ఇళ్లకు సైకో రంగులు వేసుకున్నాడు కానీ మీకివ్వలేదు. కరెంటు స్తంభాలు, శ్మశానాలను కూడా వదిలిపెట్టకుండా ఈ రంగులు పిచ్చోడు వైసీపీ రంగులు వేసుకుని నేను మొత్తం మార్చేశానని చెప్తున్నాడు. నంద్యాల అభివృద్ది కావాలంటే అది టీడీపీతోనే జరుగుతుంది. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించాను. రెండంకెల అభివృద్ది చేశా. ఆదాయాన్ని పెంచి 100 సంక్షేమ కార్యక్రమాలు మీకిచ్చాను. దేశంలోని మూడు రాష్ట్రల్లో ఆంధ్రప్రదేశ్ ని నిలిపే బాధ్యత నాది. 78 ఏళ్లుగా నాకు రాజకీయంలో అనుభవం ఉంది. ఇప్పటికి 9 వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నా జీవితంలో ఇలాంటి చేతగానీ దద్దమ్మను ముఖ్యమంత్రిగా ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి మీకోసం పనిచేశా.
వైసీపీ ప్రభుత్వంలో బాదుడే.. బాదుడు..
ఎన్నికల ముందు పాదయాత్రకు వచ్చాడు. బుగ్గలు నిమిరాడు తలపై ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దాడు. అందుకే నేను ‘ఇదేం ఖర్మ’ అని ప్రోగ్రాంతో రాష్ట్రమంతా తిరిగి సమీక్ష చేసి మీకు అండగా నిలబడ్డాను. శుక్రవారం వస్తే చాలు పోలీసులు గోడలు దూకుతారు. మరోవైపు వైసీపీ నాయకులు ప్రొక్లేన్లు తీసుకొస్తారు. ఎవరైనా ఎదురు మాట్లడితే వాళ్ల ఇళ్లు కూల్చివేస్తారు. వీళ్లకి కూల్చడం తెలుసు గానీ, కట్టడం తెలియదు. విధ్వంసం మొదలయ్యింది మా ఇంటి పక్కన ఉన్న ప్రజా వేదిక కూల్చివేతతోనే అప్పటినుండి ఈ సైకో జగన్ రెడ్డి దేనిని వదిలి పెట్టకుండా కూల్చివేస్తూ వస్తున్నాడు.
సాగునీటి రంగాలన్నీ సర్వనాశనం
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగాల్ని సర్వనాశనం చేశాడు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజంటేషన్ నిర్వహించి నందికొట్కూరు, శ్రీశైలం దగ్గర ప్రారంభించి పది రోజుల్లో రాష్ట్రమంతా తిరిగాను. అంగళ్లులో నామీద దాడి చేసి తిరిగి నా మీదే కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా దూసుకెళ్తా ఏం చేస్తారో చేసుకోండి అని ముందుకు వెళ్లాను. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. 2019 లో 52 సీట్లకు 42 గెలిపించారు. కులంపేరు, మతం పేరు, చెప్పి ఓట్లు వేయించుకుని మిమ్మల్ని గోదావరిలో ముంచేశాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే ఈ గడ్డపైనే పుట్టాను. మీ అందరి అభిమానంతో రాజకీయల్లో దూసుకెళ్తూ అందరి దగ్గర గౌరవాన్ని సంపాదించా.
ప్రజలందరికీ కొన్ని ప్రశ్నలు
మీకు విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి, డ్రగ్స్, కావాలా? నడిపించే నాయకుడు కావాలా? నరరూప రాక్షసులు కావాలా? విలువ ఇచ్చే ముఖ్యమంత్రి కావాలా? సైకో ముఖ్యమంత్రి కావాలా? ఆస్తులకు రక్షణ కావాలా? ల్యాండ్ గ్రాబింగ్ కావాలా? నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా? రహదారి భద్రత కావాలా? రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేసే దొంగ కావాలా? మీ ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచే నాయకుడు కావాలా?
నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు
గతంలో రూ. 40 ఉండే క్వార్టర్ బాటిల్ ఈ రోజు రూ.200 అయింది. అది కూడా జే ట్యాక్స్ తో ‘జే బ్రాండ్’ మద్యం. చిన్న చిన్న కొట్లులో కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానం ఉంది మరి మందు షాపుల్లో ఎందుకు లేదు. మద్యపాన నిషేదమని మాట తప్పాడు. జగన్ మోసకారి, ప్రజల్ని పీక్కు తినే పీనుగు. మద్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్ ఎందుకు లేదో చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జే బ్రాండ్ రద్దు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతా. ధరలు కూడా నియంత్రిస్తా. కరెంటు బిల్లు నియంత్రణ కావాలా? షాకు కొట్టే కరెంటు బిల్లులు కావాలా ? గతంలో రూ.200 తో నాణ్యమైన కరెంటు ఉంటే ఇప్పుడు రూ.1000 కు పెంచారు. ఉచిత ఇసుక కావలా ? ఇసుక మాఫియా కావాలా? మళ్లీ ఈసారి ఎన్నికల్లో ఎక్కడైనా ఫ్యాను తిరిగితే ఆ ప్రాంతానికి మళ్లీ కష్టాలే.
గతంలో బాబాయి శవంతో శవరాజకీయం
జగన్ రెడ్డి మీ బాబాయిని చంపిందెవరు నిజం చెప్పాలి. నీ చెల్లెల్లు అడిగారు, నేను అడిగాను, ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పగలవా. కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ప్రజలకొద్దు మీకు సంక్షేమం కావాలి. బాబాయిని గొడ్డలితో చంపి, చెల్లెల్ని కారెక్టర్ గురించి మాట్లాడే వాడిని మీరు నమ్ముతారా? ఆఖరికి తన కన్న తల్లి శీలాన్ని కూడా తప్పుపట్టిన దుర్మార్గుడు జగన్. తల్లిని రాజకీయాలకు ఉపయోగించుకుని అవసరం తీరాక గెంటేశాడు.
మీకోసం నేనొక మేపిఫెస్టో ఇచ్చా, జగన్ ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. చిలకలూరి పేట సభలో జగన్ మాట్లాడారు ఈ ఎన్నికల్లో జగన్ కి ఓటేస్తే పథకాలు కొనసాగింపు లేదంటే పథకాలు ముగింపేనని చెప్పాడు. నేను పేదవారి వైపు ఉంటాను. సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తాను. జగన్ నొక్కిన బటన్ల వల్ల ఎవరికీ అభివృద్ధి జరగలేదు. జనవరిలో బటన్ నొక్కితే మే వరకు కూడా మీ అకౌంట్లకు డబ్బులు రాలేదు. ఆ డబ్బులు పడడానికి ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుందో. దొంగ మాటలు చెప్పి రాజకీయ లబ్ది కోసం ఎన్నికల ముందు డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్తున్నాడు. 99 శాతం హామీలన్ని పూర్తి చేశాడంటా. అక్కలకు, చెల్లెల్లకు ఇళ్లు కట్టించాడట. టీడీపీ వచ్చిన తర్వాత సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి పేదవాళ్లకి పంచుతానని హామీ ఇస్తున్నా.
గొప్ప నాయకుడు పవన్
నా మిత్రుడు పవన్ కళ్యాణ్ సినీ రంగాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. జనసేన జెండాలు పట్టుకుని అల్లు అర్జున్ వస్తే తప్పుడు రాజకీయాలు, చౌక రాజకీయాలు చేశారు. వైసీపీ వాళ్లంతా పనికిమాలిన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడు. అతనే సండే ఎమ్మెల్యే సండే మాత్రమే వస్తాడు. అతనిని శాశ్వతంగా ఇంటికి పంపిద్దాం.
సూపర్ -6 తో అభివృద్ధి
ఈరోజు మీకోసం సూపర్-6 పథకాలు తీసుకొచ్చాం. మహాశక్తి పథకం కింద ప్రతి ఒక్క ఆడబిడ్డకు రూ. 1500లు, సంవత్సరానికి రూ.18 వేలు, 5 సంవత్సరాలకు రూ. 90 వేలు ఇస్తా. ఇంట్లో ముగ్గురుంటే రూ.18 వేలు చొప్పున సంవత్సరానికి రూ.58వేలు ఐదేళ్లకు 2 లక్షల 70 వేలు మీకు ఇస్తా. ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తా. నలుగురు బిడ్డలుంటే రూ.60 వేలు ఇస్తా. ‘దీపం’ పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
యువతకు ఉద్యోగ భవిష్యత్తు
యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు, పవన్ కళ్యాణ్ రావాలి. సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తా. రైతులకు అన్నదాత కింద రూ.20 వేలు ఇస్తా. ప్రాజెక్టులు పూర్తి చేస్తా. పరిశ్రమలు తీసుకొస్తా. పింఛన్లు రూ.200 నుండి రూ.2000 కు పెంచిన పార్టీ టీడీపీ. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.4 వేలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. పాత బకాయిలతో కలిపి జులైలో రూ.7 వేలు ఇస్తా. దివ్యాంగులకు రూ.6 వేలు జులైలో రూ.12 వేలు ఇస్తా. గత రెండు నెలలుగా పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వకుండా ముసలి వాళ్లని బ్యాంకులు చుట్టూ తిప్పి శవరాజకీయాలు చేసిన దుర్మార్గుడు ఈ జగన్.
మీ భూమి మీ హక్కు
మీ భూమి మీది కాదంట. జగన్ భూహక్కు చట్టం కింద మీకిచ్చాడట. మీ భూమి పాస్ పుస్తకం పైన రాజముద్ర ఉండాలి లేదా మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫొటో కాదు. మన ఆస్తులు మనం అమ్ముకోవాలి అంటే జగన్ రెడ్డి అనుమతి కావాలంట. మన ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తన దగ్గర పెట్టుకుని, మనకు జిరాక్స్ కాపీలు ఇస్తామని చెబుతున్నారు. ఈ జిరాక్స్ కాపీ ఎందుకు పనికొస్తుంది? ముడ్డి, మూతి తుడుచుకోవడానికి తప్ప. మనలను జగన్ రెడ్డి బానిసలు అనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే జగన్ రెడ్డి గూబ గుయ్ అనాలి. మనం ఏమీ చేయలేమనే చిన్న చూపుతో మన ఆస్తులకే టెండర్ పెట్టాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. సైకో జగన్ ను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీని, జగన్ ను భూస్థాపితం చేస్తామని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. నేనొచ్చిన తర్వాత రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును తీసేస్తానని హామీ ఇస్తున్నా.
మైనార్టీల సంక్షేమాభివృద్ధి కోసం
అన్న క్యాంటిన్లు, దుల్హాన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య, చంద్రన్న భీమా, మీ ఆరోగ్యం కోసం రూ.25 లక్షలతో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తాను. మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం నంద్యాల. కర్నూలులో, హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీలు కట్టించా. ఉర్దూను రెండో భాషగా చేశా. కడప, విజయవాడలో ఆజ్ హౌస్‌లు కట్టించా. దుల్హాన్ ఇచ్చా. ఇమామ్, మౌజామ్ లకు రూ. 5వేలు ఇచ్చా. వైసీపీ నాయకులు ఎన్నార్సీ గురించి, సీఏ గురించి మాట్లడుతున్నారు. పార్లమెంట్ లో దొంగ ఓట్లు వేసి ఎవరు పాస్ చేశారు. ఢిల్లీలో గలీజు రాజకీయలు చేసి గ్లలీ కొచ్చి ఇతరులపై నిందలు వేస్తారు. మైనార్టీలకు 2014 లో 4 శాతం రిజర్వేషన్లు కాపాడా. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా. ఆజ్ యాత్రకు వెళ్లే వాళ్లకు లక్ష రూపాయలు సహాయం చేస్తా. ఇమౌములకు మౌజామ్ లకు రూ.10 వేలు ఇస్తా. క్వాజీలకు గుర్తించే బాద్యత నాది. ముస్లీంల ఓట్లన్నీ టీడీపీ కే వేయాలి. మాదిగలకు కూడా ఎ,బి,సి,డి కేటగిరీ పెట్టి న్యాయం చేస్తా. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్లకు కూడా న్యాయం చేస్తా. నేను అబ్దుల్ కలామ్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తే. జగన్ రెడ్డి అబ్దుల్ సలీం ని వేదించి నలుగురు కుటుంబ సభ్యులను భయపెట్టి చనిపోయేలా చేశాడు. మిస్బాను పొట్టన పెట్టుకున్నారు. ఇలా అనేక మందిని చంపేశారు. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసిన పార్టీ కావాలా? అబ్దుల్ సలీంను చంపేసిన పార్టీ కావాలా? రేపు ఎన్నికల్లో క్రమశిక్షణగా ఉండి పార్టీ కోసం పనిచేసే టీడీపీ అభ్యర్థి ఫరూఖ్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.