ఓటర్ మహాశయా "రండి మే 13న ఓటేద్దాం" పండగకు ఆహ్వానం
ఓటర్ మహాశయా "రండి మే 13న ఓటేద్దాం" పండగకు ఆహ్వానం
కర్నూలు (పీపుల్స్ మోటివేషన్):-
వివాహాది శుభ కార్యాలకు ఆహ్వాన పత్రికలను అట్ట హాసంగా ముద్రించడం మనం చూస్తుంటాం. ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులు మాత్రమే పంచి పెడతారు. కానీ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృ జన వినూత్నంగా ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మించిన శుభకార్యం వేరే ఏముంది? అనుకున్నారు. ఎన్నికల పర్వం.. దేశానికే గర్వం అంటూ ఈ శుభ కార్యానికి జిల్లా పెద్దగా ప్రజలందరికీ ఆహ్వానం పంపారు. అది కూడా సాదాసీదాగా కాకుండా ఓ గొప్పింటి పెళ్లి స్థాయిలోనే ముద్రించారు. 'ఓటరు అతిరథ మహారథులందరికీ నమస్కారం. మే 13వ తేదీ సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటేద్దాం' అంటూ ప్రారంభించారు. 'ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికల మహోత్సవానికి తప్పకుండా హాజరై, మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ.. ఇదే మా ఆహ్వానం. కర్నూలు జిల్లా ఓటరు మహాశయులందరూ ఈ ఎన్నికల పండగలో పెద్ద ఎత్తున హాజరై మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం' అంటూ ముగించారు. ఈ ఆహ్వాన పత్రికలను జిల్లాలోని ఓటర్లందరికీ పంపారు. దీన్ని అందుకున్న ఓటర్లు ఆశ్చర్యంతోపాటు, ఆనందం వ్యక్తం చేస్తూ.. తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్తున్నారు.