ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో PhD చేయొచ్చు
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో PhD చేయొచ్చు
నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నెట్ పరీక్ష రాసేందుకు అవకాశం
జేఆర్ఎఫ్ సాధించలేకపోయినా 75 శాతం మార్కులుంటే పీహెచ్‌డీ చేసేందుకు అనుమతి
కొత్త నిబంధనలను వెల్లడించిన యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్
డిల్లీ, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
PhD చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమి షన్(UGC) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(NET)కు హాజరుకావచ్చని ప్రకటించింది. జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్(JRF) ఉన్నా లేకపోయినా.. తమ డిగ్రీతో సంబంధం లేని ఏ సబ్జెక్టులోనైనా PhDని అభ్యసించవచ్చని తెలిపింది. అయితే దీనికోసం తమ నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75 శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులు పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఇకపై నేరుగా నెట్ పరీక్షకు హాజరుకావొచ్చని, సంబంధిత సబ్జెక్టుల్లో అనుమతి ఉంటుందని వివరించారు. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం... కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పొందిన వారు నెట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హతగా ఉంది. కాగా ఈ ఏడాది నెట్ ఎగ్జామ్ జూన్ 16న జరగనుంది. ఈ ఏడాది కంప్యూటర్ ఆధారిత పరీక్షకు బదులుగా ఆఫ్‌లైన్ విధానం నిర్వహించేందుకు యూజీసీ నిర్ణయించింది. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19 మొదలవ్వగా.. మే 10న ముగియనుంది.