Bournvita# బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించండి: కేంద్రం
Bournvita# బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించండి: కేంద్రం
పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఫేమస్
అయితే దీన్ని హెల్త్ డ్రింకుగా పరిగణించలేమన్న కేంద్రం
FSSAI నిబంధనల ప్రకారం హెల్త్ డ్రింకులేవీ లేవని స్పష్టీకరణ
బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు మాత్రమే కాకుండా, ఈ కామర్స్ పోర్టళ్లలో హెల్త్ డ్రింకులుగా చలామణీలో ఉన్న అన్ని రకాల పానీయాలు, బేవరేజెస్ కు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
"పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR) జరిపిన విచారణలో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006లో 'హెల్త్ డ్రింక్' అని దేన్నీ నిర్వచించలేదు అని నిర్ధరణకు వచ్చింది" అని కేంద్రం ఏప్రిల్ 10న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈక్రమంలో అన్ని ఇ-కామర్స్ కంపెనీలు/ పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్/ బేవరేజెస్ను 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బోర్నవిటాలో నిర్దేశిత స్థాయి కంటే చక్కెర మోతాదు అధికంగా ఉన్నట్టు ఎన్సీపీసీఆర్ గుర్తించింది. బలవర్ధకమైన ఆరోగ్య పానీయాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న వాణిజ్య ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)ని కోరింది. FSSAI నిబంధనల ప్రకారం బోర్నవిటా వంటి ఉత్పాదనలను హెల్త్ డ్రింకులుగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.