ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తారా? -సుప్రీం కోర్టు
ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తారా? -సుప్రీం కోర్టు
తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన యూట్యూబర్ బెయిల్‌ను పునరుద్ధరించిన న్యాయస్థానం
ఆరోపణలు చేయకుండా నిలువరించాలన్న సీఎం స్టాలిన్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్
ఎన్నికలకు ముందు ఎంతమందిని జైల్లో పెడతారు?
-సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
డిల్లీ, ఏప్రిల్ 08 (పీపుల్స్ మోటివేషన్):-
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్కు సుప్రీంకోర్టు బెయిల్ ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.
సీఎం స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగనన్ను 2021 అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడికి బెయిల్ మంజూరైంది. అయితే, న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ అతడి బెయిల్ ను రద్దు చేసింది. దీంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ లభించింది. అప్పటినుంచి అతడు బయటే ఉన్నాడు.
ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ యూట్యూబర్ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'యూట్యూబ్లో విమర్శలు చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూ పోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు?' అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. అందువల్ల అతడి రెగ్యులర్ బెయిల్ ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది.