పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి...! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి...!
నిత్యావసర సేవలందించే 33 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు సదుపాయం
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన
కర్నూలు, ఏప్రిల్ 07 (పీపుల్స్ మోటివేషన్):-
సార్వత్రిక ఎన్నికలు - 2024 కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు (Essential Services) అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు..
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 60 ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొన్ని కేటగిరీ ల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించబడిందన్నారు. సర్వీసు ఓటర్లు ( వారి భాగస్వామి తో సహా ) ప్రాక్సీని ఎంచుకున్న వారు కాకుండా, స్పెషల్ ఓటర్లు (వారి భాగస్వామి తో సహా)గా ప్రకటించబడిన హోదా కలిగిన వారు, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న ఓటర్లు, ఎన్నికల విధులలో ఉన్న ఆర్ఓ లు, ఎఆర్ఓ లు, పిఓ లు, ఎపిఓ లు, ఓపిఓ లు, పోలీసులు, కంట్రోలు రూమ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఈఈఎమ్ టీమ్ లు, జెడ్ఓ లు, ఎస్ఓ లు, బిఎల్ఓ లు, ఎమ్ఓ లు, డ్రైవర్లు, క్లీనర్లు, నోటిఫైడ్ ఓటర్లు అబ్సెంటి ఓటర్లతో సహా, 85 ఏళ్లు పై బడిన సీనియర్ అబ్సెంటీ ఓటర్ లు, వైకల్యం ఉన్న అబ్సెంటీ ఓటర్ లు మార్క్ చేయబడిన వారు, కోవిడ్ -19 సోకిన వారు, ముఖ్య ఎన్నికల అధికారి వారిచే నోటిఫై చేయబడిన నిత్యావసర సేవలలో ఉన్న 33 అత్యవసర సేవలకు సంబందించిన శాఖలు పోస్టల్ బ్యాలెట్ కు అర్హులైన ఓటర్లన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కొరకు సర్వీసు ఓటర్లైతే ETPBS (Electronically Transmitted Postal Ballot System) ద్వారా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీచేస్తారని, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
స్పెషల్ ఓటర్లైతే కనీసం పోలింగ్ తేదీకి 10 రోజులముందు సంబంధిత రిటర్నింగ్ అధికారి గారికి ఫార్మ్ -12 ద్వారా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎన్నికల విధులలో ఉన్న ఓటర్లైతే సంబందిత రిటర్నింగ్ అధికారి గారికి కనీసం పోలింగ్ తేదీకి 7 రోజుల ముందు ఫార్మ్-12 ద్వారా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రివెంటివ్ డిటెన్షన్ ఓటర్లైతే పేరు మరియు వివరాలు సంబందిత రిటర్నింగ్ అధికారి గారికి నోటిఫికేషన్ జారీ చేసిన 15 రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వంచే అందజేయబడతాయని, నిర్భంధంలో ఉన్న వారైతే ఫార్మ్ -12 ద్వారా దరఖాస్తు నేరుగా రిటర్నింగ్ అధికారికి పంపవచ్చునన్నారు.
నోటిఫైడ్ ఓటర్లు అబ్సెంటీ ఓటర్లతో సహా, 85 ఏళ్లు పై బడిన సీనియర్ అబ్సెంటీ ఓటర్లకైతే సంబంధిత BLO లు ఫార్మ్-12D ధరఖాస్తు అందజేసి రశీదును తీసుకొని సరైన ధ్రువపత్రములు ఉండి పూర్తి చేయబడిన దరఖాస్తులను BLO లు సేకరించి ఆర్ఓ, ఎఆర్ఓ గారికి అందచేయాల్సి ఉంటుందన్నారు. వైకల్యం ఉన్న అబ్సెంటీ ఓటర్ లు మార్క్ చేయబడిన వారైతే అధీకృత అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రం జత చేయాలని, కొవిడ్ -19 సోకిన వారైతే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రము జత చేయాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల అధికారి వారిచే నోటిఫై చేయబడిన నిత్యావసర సేవలలో ఉన్న 33 అత్యవసర సేవలకు సంబందించిన శాఖల ఉద్యోగులైతే సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన 5 రోజుల లోపల అనగా ఏప్రిల్ 22 వ తేదీ లోపల ఫార్మ్-12D ధరఖాస్తు (సంబంధిత శాఖ నోడల్ అధికారిచే దృవీకరించబడిన) వాటిని సమర్పించవలసి ఉంటుందన్నారు.
వివిధ విభాగాల్లో విధుల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని, ఈ అవకాశాన్ని అర్హులైన ఆయా విభాగాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అర్హతవున్న విభాగాల వివరాలను వెల్లడించిందన్నారు. ఇందుకోసం జిల్లాలోని సంబంధిత శాఖాధికారి వారి శాఖకు సంబంధించి ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలన్నారు. సదరు నోడల్ అధికారి సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియజేసి పోలింగ్ రోజున శాఖ విధుల్లో ఉన్న వారిని పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో ధృవీకరించి వారి దరఖాస్తులను ఏప్రిల్ 22 లోపు రిటర్నింగ్ అధికారికి పంపాలన్నారు..
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన విభాగాలు
1. మెట్రో
2. రైల్వే రవాణా (ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు
3. పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ పొందిన మీడియా వ్యక్తులు.
4. విద్యుత్ శాఖ
5. బీఎస్ఎన్ఎల్
6. పోస్టల్ టెలిగ్రామ్
7. దూరదర్శన్
8. ఆలిండియా రేడియో
9. రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కో.ఆపరేటివ్ సొసైటీలు
10. ఆరోగ్య శాఖ
11. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్
12. విమానయానం
13. రోడ్డు రవాణా సంస్థ
14. అగ్నిమాపక సేవలు
15. ట్రాఫిక్ పోలీస్
16. అంబులెన్స్ సేవలు
17. షిప్పింగ్
18. ఫైర్ ఫోర్స్
19. జైళ్లు
20. ఎక్సైజ్ శాఖ
21. వాటర్ ఆథారిటీ
22. ట్రెజరీ సర్వీస్
23. అటవీశాఖ
24. సమాచార, ప్రజాసంబంధాల శాఖ
25. పోలీసు
26. పౌర రక్షణ- హోంగార్డులు
27. ఆహార పౌర సరఫరాలు - వినియోగదారుల వ్యవహారాలు
28. ఎనర్జీ (పవర్)
29. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
30. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
31. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి
32. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్
33. విపత్తు నిర్వహణ
పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ (అసెంబ్లీ – పింక్ రంగు, పార్లమెంటు – తెలుపు రంగు), ఫార్మ్-13A డిక్లరేషన్, ఫార్మ్-13B ఇన్నర్ ఎన్విలోప్, ఫార్మ్ -13 సి ఔటర్ ఎన్విలప్, ఫార్మ్ 13 డి ఓటర్ సూచనలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధిత రిటర్నింగ్ అధికారి గారిచే పోస్టల్ బ్యాలెట్ తో పాటు జారీ చేయబడతాయని కలెక్టర్ తెలిపారు. సర్వీస్ ఓటర్లకైతే ETPBS విధానము ద్వారా రిటర్నింగ్ అధికారి గారిచే పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరిగిన 24 గంటలలో జారీ చేయబడుతాయన్నారు.
ఎన్నికల విధుల్లో ఉండే ఓటర్లకైతే నియోజకవర్గ కేంద్రాలలో ఫెసిలిటేషన్ సెంటర్స్లో నిర్ణయించిన తేదీలలో పోస్టల్ బ్యాలెట్ అందజేయబడుతుందని, అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం 13A డిక్లరేషన్ ఫార్మ్ ను పూర్తి చేసి అటేస్టేషన్ చేయించుకోవాలని, ఫార్మ్ -13A డిక్లరేషన్, మార్క్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ను ఫామ్-13C ఎన్వలప్ లో పెట్టీ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో వేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ సంఖ్యను ఫార్మ్-13A డిక్లరేషన్ పై, ఫార్మ్-13B కవర్-A (ఇన్నర్ ఎన్వలోప్) మీద తప్పక వ్రాయలని, సరైన పద్ధతిలో లేని పోస్టల్ బ్యాలెట్ లు తిరస్కరించబడతాయన్నారు.
నోటిఫైడ్ ఓటర్లు అబ్సెంటి ఓటర్లతో సహా, 85 ఏళ్లు పై బడిన సీనియర్ అబ్సెంటి ఓటర్ లు, వైకల్యం ఉన్న అబ్సెంటి ఓటర్ లు మార్క్ చేయబడిన వారికి హోమ్ ఓటింగ్ విధానం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.. సెక్టోరల్ అధికారి పర్యవేక్షణలో సెక్యూరిటీ ఉన్న మొబైల్ పోలింగ్ టీంలను ఏర్పాటు చేసి సంబంధిత ఓటర్లకు బిఎల్ఓ/ఎస్ఎమ్ఎస్ ల ద్వారా మరియు పోటీలో ఉన్న అభ్యర్థులకు హోమ్ ఓటింగ్ బృందాల పర్యటన ముందస్తు సమాచారం అందజేసి ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారని, సంబంధిత ఓటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రాఫీ చేయబడుతుందని, రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి ఏ మాత్రం భంగము కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్య ఎన్నికల అధికారి వారిచే నోటిఫై చేయబడిన నిత్యావసర సేవలలో ఉన్న 33 అత్యవసర శాఖలకు సంబందిత నియోజకవర్గ కేంద్రాలలో పోస్టల్ ఓటింగ్ సెంటర్ / ఫెసిలిటెషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునే సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
పోలీసు వారికి, పోలింగ్ విధులలో ఉన్న పోలీసు సిబ్బందికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక ఫెసిలిటెషన్ సెంటర్ లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసి పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఫెసిలిటెషన్ సెంటర్ ఏర్పాటు చేయు తేదీ, స్థలము, సమయము, వివరాలు పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే రిటర్నింగ్ అధికారుల ద్వారా తెలియజేయబడుతుందని, అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకొనవచ్చునని, మొత్తము ప్రక్రియ వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని, రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి ఏ మాత్రం భంగము కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు ధరఖాస్తు చేసిన వారికి పోలింగ్ కేంద్రం లో ఓటు వేసే సౌకర్యం ఉండదని కలెక్టర్ వివరించారు.