ఎన్నికల అఫిడవిట్ లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రతి ఆస్తినీ వెల్లడించాల్సిన అవసరం లేదు- సుప్రీం కోర్టు
ఎన్నికల అఫిడవిట్ లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రతి ఆస్తినీ వెల్లడించాల్సిన అవసరం లేదు
- అరుణాచల్ ప్రదేశ్ తేజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆస్తులను అన్నింటిని వెల్లడించలేదని కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేత
- కాంగ్రెస్ నేతకు అనుకూలంగా గౌహతి హైకోర్టులో తీర్పు
- హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
- తేజ్ ఎమ్మెల్యే కరిఖో క్రి ఎన్నికను సమర్థించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్
- అభ్యర్థి చరాస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఓటరు కచ్చితమైన హక్కు కాదన్న సుప్రీంకోర్టు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను అన్నింటినీ బహిర్గతపరచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అభ్యర్థులు తమ ఆస్తిని లేదా తమ కుటుంబ సభ్యుల ఆస్తిని కచ్చితంగా వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే కరిఖో క్రి ఎన్నికను సమర్థిస్తూ న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
నామినేషన్ దాఖలు సమయంలో ఆయన భార్య, కుమారుడికి చెందిన పూర్తి ఆస్తుల జాబితాను ప్రకటించనందుకు గాను కరిఖో క్రి ఎన్నికను రద్దు చేస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కరిఖో క్రి తన భార్య, కుమారుడికి చెందిన మూడు వాహనాలను బహిర్గతం చేయలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నూనీ తయాంగ్ గౌహతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గౌహతి హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు... హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. అత్యంత విలువైన ఆస్తులు కలిగి ఉండి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే తప్ప అభ్యర్థి, తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిని బహిర్గతం చేయకపోవడాన్ని ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్ 123 ప్రకారం అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే, అభ్యర్థి తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని అంశాల్లో గోప్యతను పాటించే హక్కు ఉందని తెలిపింది. అభ్యర్థి చరాస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఓటరు కచ్చితమైన హక్కు కాదని పేర్కొంది.