కాలుష్యంతోనూ షుగర్ వ్యాధి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
కాలుష్యంతోనూ షుగర్ వ్యాధి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
మారిన జీవన శైలి...
శారీరక కష్టం లేకపోవడం..
జంక్ ఫుడ్.. అధిక కొవ్వు పదార్థాలు..
టైప్–2 మధుమేహం బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువ
గాలిలో చేరే పీఎం 2.5 కలుషితాలకు గురవడమే కారణం
ప్రఖ్యాత లాన్సెట్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి
మారిన జీవన శైలి.. శారీరక కష్టం లేకపోవడం.. జంక్ ఫుడ్.. అధిక కొవ్వు పదార్థాలు తినడం వంటివి డయాబెటిస్ కు కారణమవుతాయన్నది తెలిసిందే. కానీ వాటితోపాటు వాతావరణంలోని కాలుష్యం కూడా షుగర్ వ్యాధి రావడానికి కారణమవుతోందని పరిశోధకులు తాజాగా తేల్చారు. గాలిలో చేరే పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) 2.5 కలుషిత కణాలకు ఎక్కువకాలం లోనవడం ఈ సమస్యకు దారితీస్తోందని గుర్తించారు. దీనికి సంబంధించి ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
మరి పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
పీఎం 2.5 కలుషితాలను పీల్చుకుంటూ ఉండటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచి.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి దారి తీస్తోంది. పీఎం 2.5 కలుషితాలకు ఒక నెల రోజుల పాటు గురైన వారిలో బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అదే ఏడాది పాటు ఈ కలుషితాలకు లోనైతే టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతోంది. ఈ కలుషితాల వల్ల డయాబెటిస్ తోపాటు కిడ్నీ వ్యాధుల సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. పీఎం 2.5 పొల్యూషన్లకు లోనవకుండా జాగ్రత్త పడితే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కలుషిత ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్కులు వినియోగించడం, ఎయిర్ ఫిల్టర్లను వాడటం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ఏమిటీ పీఎం 2.5 ?
మన వెంట్రుక మందం కన్నా 30 రెట్లు చిన్నగా ఉండే కలుషిత పదార్థాలే పీఎం 2.5 కలుషితాలు. వాహనాల నుంచి వెలువడే పొగ, చెత్తా చెదారాన్ని తగలబెట్టడం వల్ల, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, ధూళి వంటి వాటిలో పలు రకాల విష వాయువులతోపాటు పీఎం 2.5 కలుషితాలు ఉంటాయి.