ప్రజలకు మేలు చేసిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి..
ప్రజలకు మేలు చేసిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి... శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
నంద్యాల, ఏప్రిల్ 24 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చేశారని, మంచి చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని మరోసారి గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కోరారు. బుధవారం 36 వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగిరెడ్డి,ఆధ్వర్యంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన కాలంలో నంద్యాల నియోజక వర్గంలో నాడు నేడు క్రింద పాఠశాలల పునర్ వైభవం, పార్క్ లు, అర్భన్ హెల్త్ సెంటర్లు, గ్రామాలలో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, మిల్క్ కేంద్రాలు, నంద్యాల నుండి హైదారాబాద్ వరకు నేషనల్ హై వే, నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు నేషనల్ హై వే నిర్మాణం, నంద్యాలలో టీటీడీ ఏసీ కల్యాణ మండపం నిర్మాణం, ఇలా ఆనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, వీటన్నిటినీ కేవలం 3సంవత్సరాల కాలములో చేపట్టానని గర్వంగా చెబుతున్నామని తెలిపారు. తాను ఒక సాదారణ ఎంఎల్ఏ గా ఉండి ఇంత మేర అభివృద్ది సాధించానని, ఐతే తన ప్రత్యర్థి టీడీపీ నేత ఫరూక్ 21సంవత్సరాలు అధికారం చేపట్టినప్పటికీ నంద్యాలకు చేసింది, ఎమీ లేదన్నారు. వాస్తవాలు మాట్లాడితే... తనపై కోపం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో మీసం ఉంటే, మగాడివి అయితే అంటూ మాట్లాడటం ఈ పెద్ద మనిషి వ్యవహారం అన్నారు. తానేంటో తన మగ తనం ఏంటో చేసి చూపించానని, ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్లస్థలాలపై కోర్టులకు వెళ్లారని, మెడికల్ కళాశాల నిర్మాణం ఆపేందుకు కోర్టులకు వెళ్లారని, బొగ్గులై ప్రాంతంలో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లస్థలాలపై కోర్టులకు వెళ్లారని వీటన్నింటిపై తాను కోర్టులలో గెలిచి తన సత్తా ఏంటో తన మగతనం ఏమిటో నిరూపించుకున్నానని పేర్కొన్నారు. ఫరూక్ ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాలని హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఉంటూ గడపగడపకు 221 రోజులు ప్రజల మధ్యలో అనేక గంటల పాటు ఎండ వాన లెక్కచేయకుండా ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు. అయితే టిడిపి అభ్యర్థి ఫరూక్ తాను అధికారంలో ఉన్న కాలంలో ఏనాడైనా ప్రజల కోసం ప్రజల వద్దకు వెళ్లారా అని సూటిగా ప్రశ్నించారు. ఆఖరి ఎన్నికలు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఫరూక్ ప్రజలను అడుగుతున్నారని, ప్రజలు ఆయనను ఒక్కసారి అవకాశం కల్పిస్తే మరోసారి మీ వద్దకు రారని, కేవలం ఓట్లకు మాత్రమే మీ వద్దకు వచ్చి మోసపు మాటలను చెప్పి ఓట్లను దండుకుంటారని నమ్మవద్దని తెలిపారు. ఇదే ఆఖరి సారి పోటీ చేస్తున్నానని చెబుతున్న ఫరూక్ అలాగే చంద్రబాబు నాయుడు ప్రజల కోసం చేసేది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన కాలంలో జగనన్న సీఎంగా కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యానికి వేల కోట్లు ఖర్చు పెట్టారని, అలాగే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించి చేయూత ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు.. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రం అప్పుల్లోకి నెడుతున్నాడని, ప్రజలను సోమరి పోతులను చేస్తున్నారని ప్రచారం చేయడం జరిగింది. అయితే నేడు ఎన్నికల వేళలో ఇదే చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను ఇస్తానని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఇస్తే రాష్ట్రం అప్పులపాలు కాదా? ప్రజలు సోమరి పోతులు కారా?అని సూటిగా ప్రశ్నించారు. 14 సంవత్సరాలు అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని కోరడం సబబుగా లేదని, తన హాయంలో ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని అందించలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది కాబట్టి తాము దైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. మే 13 తేదీ జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం వస్తుందని, నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మానంద రెడ్డి పోటీలో ఉన్నారని మీ అందరి ఆశీర్వాదాలను అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు. ప్రచారంలో శిల్పా రెడ్డి,విజయేశ్వర రెడ్డి,వెంకటరెడ్డి, బీసీ వెంకటేశ్వర్లు,జయప్రకాష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చల్లా సత్యం, పుల్లయ్య, రవి, శేసు, సుబ్బయ్య, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, ఫామ్ షావలి మరియు వార్డు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.