ముఖ్యమంత్రికి ఓ న్యాయం... సామాన్యుడికి మరో న్యాయం ఉండదన్న హైకోర్టు
ముఖ్యమంత్రికి ఓ న్యాయం... సామాన్యుడికి మరో న్యాయం ఉండదన్న హైకోర్టు
సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులుండవ్
అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత
విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు...
నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదు... డిల్లీ హైకోర్టు
డిల్లీ, ఏప్రిల్ 09 (పీపుల్స్ మోటివేషన్):-
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఓ న్యాయం... సామాన్యుడికి మరో న్యాయం ఉండదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు హైకోర్టు పేర్కొంది. ఆయన అరెస్టును చట్టవిరుద్ధంగా చెప్పలేమని తెలిపింది. నిందితుడి అరెస్ట్ చట్టప్రకారం జరిగిందా? లేదా? అన్నది చూడాలని, కానీ ఎన్నికల సమయమని చూడవద్దని పేర్కొంది. అరెస్ట్ చేసే సమయాన్ని ఈడీ నిర్ణయించిందని భావించలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీ తగిన ఆధారాలు కలిగి ఉందని తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదని పేర్కొంది.