దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు.. రెడ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ!
దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు.. రెడ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ!
చాలా రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు రెడ్ అలర్ట్ జారీ
కోస్తాంధ్ర సహా బిహార్, ఝార్ఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణం
నేడు, రేపు వడగాడ్పులు వీస్తాయని హెచ్చరిక
తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఉత్తరాండ్ కు వర్ష సూచన
జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
సిక్కింలో బుధవారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. లడఖ్, జమ్మూ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో వర్షాలతోపాటు మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు నదీ జలాల వద్దకు వెళ్లరాదని సూచించింది. ఉత్తరాఖండ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. పంజాబ్ లోని ఉత్తరాది ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హరియాణాలోని ఉత్తరాది ప్రాంతాలు, రాజస్తాన్ లోని వాయవ్య ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
అలాగే బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కేరళ, ఉత్తరప్రదేశ్ లలో, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, యానాంలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది. మరోవైపు జమ్మూ, కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్ లలో సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.