23 మంది అధికారులపై ఎన్నికల సంఘం వేటు
23 మంది అధికారులపై ఎన్నికల సంఘం వేటు
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ విధి నిర్వహణలో అలసత్వం చూపిన 5 రాష్ట్రాలకు చెందిన 23 మంది ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. అస్సాం, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఐజీలు, డీసీపీ, 12 మంది ఎస్పీలు, 8 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరూ తక్షణం విధుల నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను తమ కింద ఉన్న అధికారికి అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఎవరికీ 2024 సాధారణ ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నిర్దేశించింది. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ ను తమకు పంపాలని ఈసీ పై అయిదు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
వీరిలో ఏపీ నుంచి....
ముగ్గురు IAS లతోపాటు, ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు.