TS-TO-TG# (టిఎస్ టు టిజి) కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ 09 0001 నుంచి...
TS-TO-TG# (టిఎస్ టు టిజి) కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ 09 0001 నుంచి...
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా TG కోడ్ తో హనాలు రిజిస్ట్రేషన్ కానున్నాయి. TS కు బదులు టీజీ ఉపయోగించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలో TG 09 నుంచి TG 14 వరకు కొత్త కోడ్లు అందుబాటులో ఉన్నాయి. TG 14 ప్రస్తుతం వినియోగించడం లేదు.
పక్కన ఉన్న రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్టీఏలకు TG 07, మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లికి TG 08 కోడ్లను వాడుతున్నారు. అయితే నగరంలో వాడే కొత్త సిరీస్లో తొలుత 10 వేల నంబర్ల వరకు మధ్యలో A, B, C లాంటి ఆంగ్ల అక్షరాలు ఉండవు. ఉదాహరణకు.. ఖైరతాబాద్ ఆర్టీఏకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ TG 09 0001 నుంచి ప్రారంభమవుతుంది. 10 వేల నంబర్ల దాటిన తర్వాత TG 09 పక్కన ఆంగ్ల అక్షరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లికి ఒకటే కోడ్ ఉండటంతో ఆయా కార్యాలయాలకు సంబంధించి ఒకటే సిరీస్ నంబర్లు రాకుండా మధ్యలో ఆంగ్ల అక్షరాలు వినియోగించనున్నారు.
కొత్త కోడ్ రావడంతో మూడు రకాల సిరీస్ లతో వాహనాలు కనిపిస్తాయి. ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మలక్పేట, తిరుమలగిరి, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కూకట్ పల్లి, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 3 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పటికే TS కోడ్ తో రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసిన వారికి అదే కోడ్తో రిజిస్ట్రేషన్ చేస్తారు. వీరికి టీజీ కోడ్ కావాలంటే ఇప్పటికే చెల్లించిన ఫీజు తిరిగివ్వరు. కొత్తగా మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.