-Advertisement-

General Elections-2024 #ఎన్నికల నగారా... ఏపీలో మే 13న ఎన్నికలు... ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు

General elections 2024, Loksabha elections 2024, General Elections News, General Elections Dates, General Elections faces, General Elections States,
Peoples Motivation

General Elections-2024

#ఎన్నికల నగారా... ఏపీలో మే 13న ఎన్నికలు... ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్

నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి..!

General elections 2024
డిల్లీ, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-

కేంద్ర ఎన్నికల సంఘం నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు..

ఏపీలో మే 13, అరుణాచల్ ప్రదేశ్,  సిక్కింలో మే 19న, ఒడిశాలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, రెండో దశ ఎన్నికలు మే 20న నిర్వహించనున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా... ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో...

👉తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరుతుంది.

👉రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు.

👉మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మే 7న పోలింగ్ జరుగనుంది. మూడో విడతలో 12 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి.

👉నాలుగో దశ లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుయి.

👉ఐదో దశ లోక్ సభ ఎన్నికలకు మే 20న పోలింగ్ జరగనుంది.

👉ఆరో దశ లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 25న పోలింగ్ జరగనుంది.

👉ఏడో దశ ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.

17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుండగా.... అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.

CEC RAJIV KUMAR

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రెస్ మీట్ ముఖ్యంశాలు:

సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ నేడు మీడియా ఎదుట వెల్లడించింది. షెడ్యూల్ తో పాటే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచమంతా భారతదేశ ఎన్నికల వైపు దృష్టి సారించిందని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు అని వివరించారు. ఈసారి 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగులు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. 

పోలింగ్ కోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ కోసం 1.25 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికలకు సౌకర్యాల కల్పన ఓ సవాల్ అని, అయితే ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. 

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని అన్నారు. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే ఆ కేసుల వివరాలు, ఆస్తులు, అప్పుల వివరాలను యాప్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఎవరైనా తాయిలాలు, నగదు పంపిణీ చేస్తుంటే ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. సదరు ఓటర్ సెల్ ఫోన్ లొకేషన్ ను బట్టి 100 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటామని స్పష్టం చేశారు. 

ధనబలం, కండబలం నియంత్రణ అతిపెద్ద సవాలుగా ఉందని, ఈ దిశగా తాము పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రచారం, పోలింగ్ వేళ అవాంఛనీయ ఘటనల నివారణ బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సమాచారం సేకరిస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు నిరంతరం సమాచారం తెలుసుకుంటామని, ఐదు మాధ్యమాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారి ఉంటారని పేర్కొన్నారు. 

రాష్ట్రాల మధ్య అనధికార వస్తువులు, డబ్బు రవాణా జగరకుండా నిఘా వేస్తామని, అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ డ్రోన్లతో నిఘా ఉంటుందని వివరించారు. రీపోలింగ్ జరపాల్సిన అవసరాన్ని తగ్గించడం, హింసకు, ఫేక్ న్యూస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం తమ ప్రాధాన్య అంశాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

Comments

-Advertisement-