-Advertisement-

Election Code#ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఏయే నిబంధనలు అమల్లోకి వస్తాయి ?

General elections 2024, Loksabha elections 2024, General Elections News, General Elections Dates, General Elections faces, what is election code?
Peoples Motivation

Election Code#ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఏయే నిబంధనలు అమల్లోకి వస్తాయి ?

Election Commission
దేశ వ్యాప్తంగా 2024 మహా సంగ్రామం మొదలయింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 6న ఎన్నికల కోడ్ ముగియనుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు. పలు సందర్భాల్లో నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్తుంటాయి. ఇంతకీ ఏమిటీ కోడ్? ఎందుకు ఇది ముఖ్యం?

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడనవి ఏంటనేది ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు గానూ ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని.. పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు.. ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది.

ఎన్నికల కోడ్ నిబంధనలు:

కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గానీ, ఇతర మాధ్యమాల్లో గానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.
మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు.
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.
రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే, కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామావళికి వ్యతిరేకం.
దేవాలయాలు, మసీదులు, చర్చిలు.. ఇలా ఏ ప్రార్ధనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు.
సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో పార్టీలు నగదు తరలించడానికి వేర్వేరు మార్గాలను అనుసరిస్తుంటాయి. కోడ్ సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మంచిది.

పోలింగ్ రోజు సూచనలు

రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో సహకరించాలి. ఓటర్లకు ఇచ్చే స్లిప్‌లు సాధారణ కాగితంపై ఉండాలి. ఏ విధమైన పార్టీ గుర్తులు, అభ్యర్ధి పేరు, పార్టీ పేరు ఉండకూడదు. ఓటింగుకు 48 గంటల ముందు మద్యంపై నిషేధం ఉంటుంది.


Comments

-Advertisement-