ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది...
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది...
• లోక్ సభ అభ్యర్థి రూ.95 లక్షలు,శాసన సభ అభ్యర్థి రూ.40 లక్షల గరిష్ఠ వ్యయం
• ఎన్నికల వ్యయంపై ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించాలి
• రాజకీయపార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, మార్చి 07 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ, వ్యయ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలని చెప్పారు. ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తరువాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల నియమావళిలో పాటించవలసిన ప్రధానాంశాలు..
👉ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలి
👉పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కార్యక్ర మాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం
👉కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధం
👉అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం
👉స్టార్ క్యాంపెయినర్లు రూ. లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు.
👉పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేస్తాం
👉ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామి నేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది
👉ఎన్నికల్లో పోటీ చేసే లోక్ సభకు అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగానీ లేదా ఆర్.బి.ఐ. / ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చెక్కులు, బ్యాంకు డ్రాఫ్టులు అనుమతించం
👉ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబం ధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు
👉నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహ నాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తాం
👉అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తాం
👉ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది
👉ప్రతి లోక్సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేం దుకు అనుమతి ఉంటుంది
👉ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి
👉ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమ తులు, లిక్కరు, ఇతర వస్తువులు పంపిణీ చేయ డాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం
👉ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి
👉రోజువారీ రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి
ఈ వర్క్ షాప్ కు అదనపు సీఈవోలు పి. కోటేశ్వర రావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపీ), ఎ.రాజేంద్రప్రసాద్ (టీడీపీ), ఐ.కె.అన్నపూర్ణ (బీజేపీ), వె.వి.రావు (సీపీఐ-ఎం), సంబంధిత అధికారులు పాల్గొన్నారు.