ఏపీలో వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదన్న ఈసీ
అవకతవకలు జరిగితే సీ-యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని వెల్లడి
హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరిక
డిల్లీ, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-
18వ లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ...ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు. హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇదే విషయాన్ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.