జంట హత్యలు కల కలం....అనుమానమే కారణమా?
జంట హత్యలు కల కలం....అనుమానమే కారణమా?
- భాగస్వామిని, ఆమె ప్రియుడిని చంపేసిన యువకుడు
- మరో మహిళ పైనా కత్తితో దాడి.. మహిళ పరిస్థితి విషమం
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న కాకినాడ పోలీసులు
గొల్లప్రోలు/ కాకినాడ, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-
బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో జరిగిన సంఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ.. ఇటీవల పోసిన శ్రీనుతో సహజీవనం చేస్తుందనే అనుమానంతో నాగబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భర్తతో విభేదాల కారణంగా లోవమ్మ ఆయనకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.