డీఎస్సీ సమయంలోనే మరో రెండు పరీక్షలు... షెడ్యూల్ మార్చాలి అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ సమయంలోనే మరో రెండు పరీక్షలు... షెడ్యూల్ మార్చాలి అభ్యర్థుల ఆందోళన
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోని డిప్యూటీ డీఈవో, ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ సమయంలోనే డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 13న డిప్యూటీ డీఈవో స్క్రీనింగ్ పరీక్ష ఉందని అలాగే ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉందని ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు డీఎస్సీతో పాటు డిప్యూటీ డీఈవో, ఏపీ సెట్ కు సిద్ధమవుతుంటారు. ఇటీవలే డీఎస్సీ పరీక్షల (మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ) తేదీల్లో మార్పులు చేసిన విద్యా శాఖ.. ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావుడిగా పరీక్షలను నిర్వహిస్తోందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. దీంతో పరీక్షల షెడ్యూల్ మార్చాలని కోరుతున్నారు.