కవిత అరెస్ట్...ఢిల్లీకి తరలించనున్న ఈడీ..
కవిత అరెస్ట్...ఢిల్లీకి తరలించనున్న ఈడీ..
కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ
కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కవిత నివాసం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లకు కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ... వారిని ఈడీ అధికారులు అనుమతించలేదు. కాసేపట్లో కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటి క్రితం కవిత ఇంటి వద్దకు కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. వీరిని కూడా కవిత ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. కవిత ఇంటి గేటు వెలుపలే వీరు నిలుచున్నారు.
ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే... ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. కవిత నివాసంలో కవిత, ఆమె భర్త, పిల్లలు, పీఏ, సహాయకులు మాత్రమే ఉన్నారు.