త్రాగునీటి సమస్యను పరిష్కరించండి మహాప్రభో... పరిశ్రమకు భూములు త్యాగం చేసిన గ్రామం గొంతెండగడతారా?
త్రాగునీటి సమస్యను పరిష్కరించండి మహాప్రభో...
పరిశ్రమకు భూములు త్యాగం చేసిన గ్రామం గొంతెండగడతారా?
-గ్రామాభివృద్ధికి విడుదలైన సోలార్ నిధులు ఏమయ్యాయి?
-శకునాల గ్రామంలో దాహం దాహం
-త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్
ఓర్వకల్లు/ కర్నూలు, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్):-
వేసవిలో ఎండలు ముదిరి భూగర్భ జలాలు అడుగంటడంతో ఓర్వకల్లు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు త్రాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు కాలనీల్లో కుళాయిలకు మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియక గంటలతరబడి ఎదురుచూస్తూ నిత్యావసరాలకు, త్రాగేందుకు నీళ్లు కరువై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండల పరిధిలోని శకునాల గ్రామాన్ని శుక్రవారం సిపిఎం పార్టీ శాఖ బృందం సందర్శించింది. ఆ పార్టీ శాఖ కార్యదర్శి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బృందం సభ్యులు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల ప్రజలు సుమారు నెల రోజులకు పైగా తీవ్ర నీటి సమస్యతో అల్లాడిపోతున్నారన్నారు. తమ కాలనీలకు మంచినీళ్ల ట్యాంకరు ఎప్పుడు వస్తుందా అని పనులు మానుకొని ఎదురుచూస్తూ పడికాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో నిర్మించిన సోలార్ పరిశ్రమ కోసం గ్రామానికి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు వేలాది ఎకరాల సాగు భూములను త్యాగం చేశారని, అలాంటిది ప్రజల కోసం గ్రామంలో బోర్లు వేయించి నీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సోలార్ పరిశ్రమ తరపున గ్రామాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, మరి ఆ డబ్బులు ఏమయ్యాయో ప్రజలకు తెలుపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో నీటి సమస్య తలెత్తిన గ్రామాలపై దృష్టి సారించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు చాంద్ బాషా, మల్లమ్మ, రమాదేవి, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.