బ్యాంకు ఖాతాలను తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు..బ్యాంకు ఖాతా వివరాలు తెలుపవద్దు
బ్యాంకు ఖాతాలను తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు
సంబందం లేని వ్యక్తులకు తమ గుర్తింపు కార్డులను గానీ, బ్యాంకు ఖాతా వివరాలు గానీ తెలుపవద్దు
-ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్):-
ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుండి సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకుల నగదును కాజేస్తూ సైబర్ నేరగాళ్లు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ విధంగా సైబర్ నేరాలకు నేరగాళ్లు ముందుగా లోన్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది అమాయకుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలను తెరిచి,సైబర్ నేరాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును ఆ ఖాతాలలో జమ అయ్యేలా చేస్తున్నారు.దర్జాగా ఒక ప్రాంతంలో కూర్చొని స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అమాయకులకు మెసేజ్ లు,ఫోన్లు చేస్తూ అత్యాశకు గురిచేస్తూ వారి బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సులభంగా కాజేస్తున్నారు.కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకుల పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచి,వారికి తెలియకుండానే వారి అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఇటీవల ఇల్లందు పోలీసులు రట్టు చేశారు.వివరాల్లోకి వెళితే
సుధాకర్ అను వ్యక్తి అశోక్ గుప్తా అను మరో వ్యక్తితో కలిసి దుబాయ్ నుండి ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన తన బావమరిది కస్యా చినబాబు@హర్షకు ఫోన్ చేసి ట్రేడింగ్ చేయడానికి ఒక కరెంట్ బ్యాంకు ఖాతా కావాలని చెబుతాడు.అట్టి ఖాతాను తెరిచి ఇచ్చినందుకు 50 వేల రూపాయలు ఇస్తానని చెబుతాడు.గాంధీ చౌక్ బ్రాంచ్,ఖమ్మం హెచ్.డి. ఎఫ్.సి బ్యాంకు నందు లోన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న కస్యా చినబాబు@హర్ష ఆశపడి ముందుగా తన భార్య ప్రియాంక పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను ఇస్తాడు.అనంతరం మరికొంత కాలానికి అశోక్ గుప్తా మరలా హర్షకి ఫోన్ చేసి మరో ఐదు బ్యాంకు ఖాతాలు కావాలని చెప్పడంతో ఇల్లందు వాస్తవ్యురాలైన తన భార్య ప్రియాంకకు చెబుతాడు.అప్పుడు ప్రియాంక ఇల్లందులో తన స్నేహితుడైన చైతన్య అనే వ్యక్తికి చెప్పి,అతనికి డబ్బు ఆశ చూపడంతో అతను తనకు తెలిసిన డ్వాక్రా మహిళలు ఐదుగురికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఖమ్మం గాంధీచౌక్ లో బ్యాంకు ఖాతాలను తెరిపించి హర్ష ద్వారా సుధాకర్ మరియు అశోక్ గుప్తాలకు ఖాతాల వివరాలను పంపించాడు.అందుకుగాను హర్ష చైతన్యకు ఒక లక్ష రూపాయలు నగదును ఇచ్చాడు.బ్యాంకు ఖాతాలను తెరిచిన ఐదుగురు మహిళలకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల చొప్పున చైతన్య 75 వేల రూపాయలను వారికి ఇచ్చి మిగతా 25 వేల రూపాయలను అతను తీసుకుంటాడు.ఈ ఐదు బ్యాంకు ఖాతాలకు సంభందించి ఆన్లైన్ బ్యాంకింగ్,ఏటీఎం కార్డుల వివరాలను కూడా దుబాయ్ లో ఉన్న అశోక్ గుప్తాకు పంపించారు.
అసలు అమాయకుల బ్యాంకు ఖాతాలతో ఏమి చేస్తున్నారో అని పోలీసులు ఆరా తీయగా దుబాయి కేంద్రంగా అశోక్ గుప్తా మరియు సుధాకర్ లు ఇండియాలోని పలు వ్యాపారస్తులకు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెడితే వారి నగదుకు చాలా రెట్లు కలిపి ఇస్తామని మాయమాటలు చెప్పి,వారు జమ చేసే నగదును ముందుగానే ఓపెన్ చేసిన అమాయకుల ఖాతాల్లో జమ చేయించేవారు.అనంతరం ఇట్టి ఖాతాల్లోని నగదును దుబాయ్ కి బదిలీ చేయించుకుని అక్కడ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.గతంలో ఇదే తరహాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడిన అశోక్ గుప్తా మరియు సుధాకర్ లపై హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయినట్లు గుర్తించడం జరిగింది.ప్రస్తుతం ఇట్టి కేసుతో సంభందం ఉన్న నిందితులను ఇల్లందు పోలీసులు గురువారం రిమాండ్ చేయడం జరిగిందని తెలియజేసారు.