-Advertisement-

ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

ఏపీలో ఎన్నికల కోడ్ అమలు...

రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది...

ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరి...

డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా వినతులు వచ్చాయని వెల్లడి

ఈ విషయాన్ని ఈసీకి నివేదిస్తామన్న సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

Chief Election commissioner of AP press meet
విజయవాడ/అమరావతి, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డీఎస్సీని వాయిదా వేయాలంటూ వెయ్యికి పైగా వినతులు వచ్చాయని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు నివేదిస్తున్నామని వివరించారు. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని అన్నారు. 

ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సీ విజిల్ యాప్ ద్వారా 1,307 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదుల్లో 74 శాతం 100 నిమిషాల్లో పరిష్కరించామని చెప్పారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన 46 మందిపై చర్యలు తీసుకున్నామని సీఈవో వివరించారు. 

ఫిర్యాదులు వచ్చిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కొందరిని సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులు పెట్టామని అన్నారు. ఒక్క వాలంటీర్లపైనే 40 కేసులు నమోదయ్యాయని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు తప్పవని మీనా హెచ్చరించారు. 

శ్రీకాకుళం డీఆర్వో, మరో డీఆర్వోపై కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సదరు డీఆర్వోలపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి మోదీ సభలో భద్రతా లోపాలపై కూడా ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. అయితే, ఈ భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందని, అందుకే ఆ ఫిర్యాదును కేంద్రానికి పంపామని తెలిపారు. 

ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటివరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించామని వెల్లడించారు. 

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని మీనా స్పష్టం చేశారు.

సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని మీనా చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

రాష్ట్రంలో వివిధ అంశాలపై 385 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని తెలిపారు. మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అందులో మద్యం విలువ రూ.1.69 కోట్లు ఉంటుందని అన్నారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై కూడా దృష్టి పెట్టామని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. 

Comments

-Advertisement-