బైక్ ను ఢీకొన్న లారీ విద్యార్థిని మృతి
బైక్ ను ఢీకొన్న లారీ విద్యార్థిని మృతి
కరీంనగర్/ జూలపల్లి, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్):-
దుబ్బపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి హన్సిక(17) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె సోదరుడు భాను ప్రకాశ్ కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన హన్సిక అనే విద్యార్థిని జూలపల్లి మండలం తెలుకుంటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ చదువుతోంది. బుధవారం కరీంనగర్ విద్యానగర్ లోని తన బాబాయి ఇంటికి పనిపై వెళ్లింది. బాబాయ్ కొడుకు భాను ప్రకాశ్ తో కలిసి ద్విచక్ర వాహనంపై సుల్తానాబాద్ కు బయలుదేరింది. ఈక్రమంలో దుబ్బపల్లి వద్ద లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్సిక తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలైన భాను ప్రకాశ్ కు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్ద చేసిన పద్మ.. చేతికి అందివచ్చిన చిన్నకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కన్నీటి పర్యంతమవుతోంది. మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.