ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
జిల్లా ఎన్నికల అధికారి& జిల్లా కలెక్టర్ డా.జి సృజన
కర్నూలు, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-
సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరించి జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు, చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) పర్యవేక్షిస్తుందని, మీడియా ఉల్లంఘనలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
రిజిస్టర్ కాబడిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు గానీ వారి తరఫున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలను ప్రసారం చేసెందుకు అనుమతి కోసం నిర్ణీత నమూనాలో 3 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటన ప్రసారం చేయుటకు 7 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు అందిన రెండు రోజుల్లోగా జిల్లాస్థాయి ఎంసీఎంసీ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందన్నారు.
వార్తాపత్రికల్లో పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి అనుమతి పొంది ప్రకటన ప్రచురించాల్సి ఉంటుందన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి అన్ని రకాల టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్ లు, డిజిటల్ డిస్ప్లే లు, మొబైల్ నెట్వర్క్ ల ద్వారా ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్ లు వస్తాయని, అలాగే సామాజిక మాధ్యమాలైన (సోషల్ మీడియా) ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ వెబ్సైట్లు కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి వస్తాయని తెలిపారు.
అలాగే సినిమా హాళ్లలోనూ, ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలలో, ఎలక్ట్రానిక్ పత్రికలలోను, ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. అనుమతి పొందిన ఆర్డర్ నంబర్ను సంబంధిత ప్రకటనపై సూచించాల్సి ఉంటుందన్నారు.. ఈ విషయాన్ని అన్ని ప్రసార మాధ్యమాలు గమనించాలని సూచించారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలుగా పరిగణించి, భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు..