-Advertisement-

26 రోజులు ఏం చేశారు..? ఎస్బీఐని సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court judgement PDF Telugu, Supreme Court of India judgements Telugu, Latest judgement of Supreme Court, Online judgements free download,
Peoples Motivation

26 రోజులు ఏం చేశారు..? ఎస్బీఐని సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఈరోజు సాయంకాలం లోపు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించాల్సిందే

గడువు పెంచాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం

ఈ నెల 15 సాయంత్రంలోగా వెబ్ సైట్ లో పెట్టాలంటూ ఈసీకి ఆదేశం

Thumbnails supreme court
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

ఎన్నికల బాండ్ల వరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గడువు పెంచేది లేదని తేల్చిచెప్పిన కోర్టు.. ఈరోజు (మార్చి 12) సాయంకాలం లోపు వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెంటనే ఎన్నికల కమిషన్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఎస్బీఐ అందించే సమాచారాన్ని ఈనెల మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెబ్ సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

ఎస్ బీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. గత నెలలో తీర్పు వెలువరించినపుడు తగినంత సమయం ఇచ్చామని, ఈ 26 రోజులుగా దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడువు ఇచ్చి, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించాలని ఆదేశిస్తే మరింత గడువు కావాలని అభ్యర్థించడం తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా గడువు పొడిగించేది లేదని స్పష్టం చేస్తూ మంగళవారం సాయంత్రంలోగా బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీలు అందుకునే విరాళాలలో పారదర్శకత కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ను గత నెల 15న అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటి వరకు ఈ విధానంలో ఏయే పార్టీలు ఎంత మొత్తం అందుకున్నాయి, ఆయా విరాళాలు అందించిన వారి పేర్లు వివరాలను ఈ నెల 6 లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత నెల 15న ఈమేరకు తీర్పు వెలువరించింది. అయితే, బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని ఎస్బీఐ అభ్యర్థించింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపరచడానికి, వాటిని మ్యాచ్‌ చేసి వివరాలను ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


Comments

-Advertisement-