అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్-2024 17వ సీజన్..
అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్-2024 17వ సీజన్..
- చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
- డ్యాన్స్ తో అలరించిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్
- హిట్ గీతాలతో ఉర్రూతలూగించిన ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ సింగర్లు
- తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
చెన్నై, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన ఓపెనింగ్ సెర్మనీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళ్లు జిగేల్మనిపించే లైటింగ్, లేజర్ షోలు, బాణసంచా విన్యాసాలు ప్రదర్శించారు.
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పలు హిట్ సాంగ్స్ కు హుషారుగా డ్యాన్స్ చేయగా, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్, శ్వేతామోహన్ తదితరులు తమ గానమాధుర్యంతో ఉర్రూతలూగించారు. వందేమాతరం గీతం ఒరిజినల్ వెర్షన్ ను సోను నిగమ్ ఆలపించగా, తాను స్వరపరిచిన ఆల్బమ్ వెర్షన్ ను ఏఆర్ రెహమాన్ ఆలపించారు. అంతకుముందు, ఏఆర్ రెహమాన్ ఎంట్రీతో చిదంబరం స్టేడియం మార్మోగిపోయింది.
రెహమాన్, ఇతర గాయకులు పలు హిట్ గీతాలతో కార్యక్రమాన్ని మరింతగా రక్తి కట్టించారు. ఢిల్లీ-6, యువ, ఛయ్య ఛయ్య, జయహో వంటి గీతాలతో రెహ్మాన్ మేనియా స్టేడియంలో ఆవిష్కృతమైంది. కాగా, ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.