అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి...కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం
అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి...కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం
- వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం అదే
- విద్యా ఉద్యోగాలకు కూడా తప్పనిసరి
- పాస్పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు, వివాహం నమోదుకు అది తప్పనిసరి
- ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నమోదు యూనిట్లు ఏర్పాటు
- వారంలో జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లను ఇవ్వాలి
- -జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ
విజయవాడ/ అమరావతి, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్):-
2023 అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికేట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా,ఉద్యోగాల్లో ఈ జనన ధృవీక రణ పత్రం తప్పనిసరని తెలిపారు. పాస్పోర్టు, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పసరి చేసిందని సీఎస్ స్పష్టం చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణాల నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి..
ఇక కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల రిజిస్ట్రే షన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజిస్ట్రార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారన్నారు. ఏ అథారిటీకైనా ఈ డేటా కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరముంటుందని ఆయన తెలిపారు. జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ల డేటాబేస్లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అన్ని జననాలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు నివేదించాల్సి ఉందని, ఇందులో జాప్యంలేకుండా సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎస్ కలెక్టర్లను కోరారు.