ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదేశాలు...
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదేశాలు...
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెవిన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, టిఎసీయండిసి, రవాణా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఇసుక మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు తనిఖీ చేపట్టేందుకు అంతరాష్ట్ర చెకోపోస్టుల వద్ద 24 గంటలు వాహనాలు తనిఖీలు చేపట్టాలని చెప్పారు. మణుగూరు, పినపాక మండలాల్లో వాహనాలు తనిఖీలు చేపట్టేందుకు చెక్పోస్టు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్ల నుండి మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని, అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తీస్తే కఠిన చర్యలు చేపట్టాలని మైనింగ్, టిఎస్యండిసి, రెవిన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణా, పరితికి మించి అదనపు లోడ్తో రవాణా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. పోలీస్, మైనింగ్, రెవిన్యూ అధికారులతో తనిఖీలు నిర్వహణకు టీములు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాలు తనిఖీలు చేసేందుకు రూటు మ్యాపులు తయారు చేయడంతో పాటు రూటు టీములు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.
అక్రమ రవాణా, అధికలోడు వాహనాలను పట్టుకుంటే అట్టి సమాచారాన్ని మైనింగ్ అధికారులకు అందచేయాలని చెప్పారు. రాత్రి సమయాల్లో రవాణా చేసే అవకాశాలు ఉంటాయని, అందువల్ల నిరంతరాయంగా పటిష్ట తనిఖీలు జరగాలని చెప్పారు. ఒక్క వాహనం కూడా చెక్ పోస్టు దాటి వెళ్లడానికి వీల్లేదని. అలా వెళ్లిన పక్షంలో సంబంధిత సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతరాష్ట్ర, జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చెకోపోస్టులు వద్ద తనిఖీలు చేపట్టేందుకు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన టీములు యొక్క సిబ్బంది జాబితా అందచేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను ఎంతమాత్రం సహించొద్దని కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనుమతిచ్చిన రీచ్లు, స్టాకు పాయింట్లు నుండి మాత్రమే ఇసుక తరలించడానికి అనుమతి ఉందని ఆయా ప్రాంతాల్లో పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అనుమతి లేని రీచ్ల నుండి ఇసుక తరలిస్తే అట్టి వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. ఇసుక రవాణా చేయు వాహనాల బిల్లులను తనిఖీ చేయాలని చెప్పారు. జిల్లాలో ఇసుక పుష్కలంగా ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అనుమతు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎస్పి రోహిన్రాజ్, ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్, అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డిఓ విద్యాచందన, ఎఎస్పి పరితోష్ పంకజ్, రవాణ అధికారి వేణు, మైనింగ్ ఏడి జైసింగ్, టిఎస్ యండిసి పిఓ శ్రీనివాస్, సర్వే ఏడి కుసుమకుమారి, డిఎస్పీలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.