సందడే సందడి...అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవం
సందడే సందడి... అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవం
- పట్టుదల, తపనతో విజయం : ఇంచార్జి డీఈవో శ్యామూల్ పాల్
-నైతిక మానవతావిలువలు నేర్పేవే కళలు
కర్నూలు (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
కర్నూలు బాలోత్సవం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. 3వ పిల్లల పండుగతో కర్నూలు నగరంలోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో సందడి నెలకొంది. తొలుత జాతీయ జెండాను ఇంచార్జి డీఈవో శామ్యూల్ పాల్, కర్నూలు బాలోత్సవం జెండాను బాలోత్సవం గౌరవాధ్యక్షులు జి.పుల్లయ్య ఎగురవేశారు. కళ్యాణమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బాలోత్సవం అధ్యక్షులు డాక్టర్ కె.బడే సాహెబ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో ఇంచార్జి డీఈవో శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పట్టుదల, తపన ఉంటే వంద శాతం విజయం సాధించవచ్చన్నారు. సాంస్కృతిక అంశాలపట్ల అవగాహన పట్టు ఉంటే చిన్ననాటి నుండే నైతిక మానవతా విలువలు అలవడతాయన్నారు. తాను ఛాలెంజింగ్ గా తీసుకుని కష్టపడి చదివి పైకి వచ్చానన్నారు. ఈ బాలోత్సవం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో కరికులంను అందుకోలేక విద్యార్థులు వివిధ భావోగ్వేదాలకు గురవుతున్నారన్నారు. జ్ఞానం అందరిలో ఉంటుందని, ఆ జ్ఞానాన్ని వెలికితీయడమే ఉపాధ్యాయుల పని అని, దాన్ని బట్టి విద్యార్థులకు చదువు వస్తుందని చెప్పారు. ప్రస్తుతం రకరకాల విద్యా విధానాలు వచ్చేశాయని, పిల్లలకు బట్టీ చదువులు అలవాటు అయిపోయాయని తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను వెలికితీసే వాళ్ళు కరువయ్యారన్నారు. విద్యార్థులను మోటివేషన్ చేయాల్సింది ఉపాధ్యాయులేనన్నారు.
విద్యార్థులు వినయ విధేయతలు అలవర్చుకోవాలని, సాంకేతికతను సరైన రీతిలో మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణాన్ని పాటించాలని తెలిపారు. బాలోత్సవం గౌరవాధ్యక్షులు, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడన్నారు. నాలెడ్జ్ పుస్తకం ద్వారా వస్తుందని, జనరల్ నాలెడ్జ్ లోకంలో తిరగడం ద్వారా వస్తుందని తెలిపారు. ఎన్ని మార్కులు వచ్చినా లౌకిక జ్ఞానం లేకుంటే ఉపయోగం లేదన్నారు. పరీక్షల కోసమే చదివితే ఏమీ సాధించలేమన్నారు. లోక జ్ఞానాన్ని సాధించడం కోసం చదవాలన్నారు. చదువొక్కటే జ్ఞానం కాదన్నారు. బాలోత్సవం సలహాదారులు, టిజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ అందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనేకానేక అపజయాలు కూడా భవిష్యత్తులో వచ్చే విజయానికి పునాదిరాళ్ళౌతాయన్నారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ కర్నూలు బాలోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. విద్యార్థులకు చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. అందరి ఆశీస్సులతో బాలోత్సవాన్ని మరింత విస్తరింపజేయాలని, దాని ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఈనాటి విద్యా వ్యవస్థలో సృజనాత్మకత కొరవడిందన్నారు. అన్ని అంశాలనూ నేర్పేది చదువు అని, ప్రస్తుతం విద్య కొన్ని అంశాలకే మరిమితమైందన్నారు. గురువారం విద్యార్థులకు క్లాసికల్ డ్యాన్స్, వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో మాంటిసోరి విద్యాసంస్థల సిఈఓ విల్సన్, కర్నూలు బాలోత్సవం ప్రధాన కార్యదర్శి జెఎన్.శేషయ్య, కల్చరల్ కార్యదర్శి ఎంపి.బసవరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కెంగార మోహన్, ప్రయివేటు విద్యాసంస్థల యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వాసుదేవయ్య, రవీంద్ర టాలెంట్ స్కూల్స్ అధినేత పిబివి.సుబ్బయ్య, యూటీఎఫ్ రాష్ట్ర సహాద్యక్షులు కె.సురేష్ కుమార్, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి.నరసింహా, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఖాజా హుసేన్, అధ్యక్షులు సుధీర్ రాజు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఆవుల బసప్ప, జనవిజ్ఞాన వేదిక సమత కన్వీనర్ రమాదేవి పాల్గొన్నారు.