ఒత్తిడిని ఓడిస్తే విజయం...సైకాలజిస్ట్ లక్ష్మీరావు
ఒత్తిడిని ఓడిస్తే విజయం
- సైకాలజిస్ట్ లక్ష్మీరావు
- ఏపీఏ ఇండియా ఆధ్వర్యంలో విజయీభవ సదస్సు
గుంటూరు, (పీపుల్స్ మోటివేషన్):-
పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పటిష్ట ప్రణాళికతో సిద్ధమైతే పరీక్షల్లో విజయం ఖాయమని సైకాలజిస్ట్ లక్ష్మీ రావు తెలిపారు. సైకాలజిస్ట్ ల సంఘం ఏపీఏ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం నున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య వక్త లక్ష్మీ రావు మాట్లాడుతూ పరీక్షల సమయంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండటం సహజమేనని, మోతాదు మించినప్పుడు మాత్రమే ఫలితాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీఏ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు కఠినంగా ఉన్న సబ్జెక్టు పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. పరీక్షలు చదువులో భాగమని గుర్తించి, వాటిని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీఏ ఇండియా రాష్ట్ర కోశాధికారి అత్తోట తేజ మాట్లాడుతూ పరీక్ష సమయంలో ఒత్తిడి గురవుతున్న విద్యార్థులకు అండగా ఉండాలని సంకల్పంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయీభవ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఏ ఇండియా సభ్యులు దీనా, రవి ప్రసాద్, ఇంచార్జ్ హెచ్ ఎం సూరపనేని రవి, నళిని, ఉపాధ్యాయులు,150 మంది పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.