రైతు పోరాటయోధుడు శుబ్ కరన్ సింగ్ కు ప్రజా సంఘాల క్యాండిల్ నివాళి
రైతు పోరాటయోధుడు శుబ్ కరన్ సింగ్ కు ప్రజా సంఘాల క్యాండిల్ నివాళి
అన్నదాతలపై బిజెపి ప్రభుత్వ పోలీసు దాడిని ఖండిస్తూ నిరసన
కర్నూలు, ఫిబ్రవరి 23 (పీపుల్స్ మోటివేషన్):-
రైతు, విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కర్నూల్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఢిల్లీ రైతు పోరాటం సందర్భంగా తుపాకీ కాల్పుల్లో మరణించిన శుబ్ కరన్ సింగ్ కు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ లైటింగ్ నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయి, వ్యకాసం జిల్లా కార్యదర్శి కే వి నారాయణ, సిఐటియు నగర నాయకులు రాముడు, రాజశేఖర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుత పోరాటానికి బయలుదేరుతున్న రైతులపై గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతులపై యుద్ధం ప్రకటించిందన్నారు. రైతుల పోరాటాన్ని అడ్డుకునేందుకు శత్రు దేశాలపై కురిపించే విధంగా పొగ బాంబుల వర్షం కురిపించి, బుల్లెట్లను ప్రయోగించడంతో యువ రైతు పోరాటయోధుడు శుభకరన్ సింగ్ హత్యగావించబడ్డాడన్నారు. గతంలో రైతులు సంవత్సర కాలంగా నిర్వహించిన పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని మరోసారి అడుగుతున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చమని, హక్కులు అమలు చేయమని శాంతియుత పోరాటం కోసం ఢిల్లీకి వెళుతున్న అన్నదాతలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధానికి దిగిందని వారు విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి ఎంఎస్పి ని వెంటనే అమలు చేయాలన్నారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పై హర్యానా పోలీసుల దమన కాండను యావత్ దేశమే ఖండిస్తోందన్నారు. రైతులపై హర్యానా పోలీసులు జరిపిన దాష్టికం పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలన్నారు. యువ రైతు శుభ కరన్ సింగ్ మృతికి కారకులైన హర్యానా పోలీసులపై హత్య నేరం కింద కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. హత్యకు గురైన శుభ కరన్ సింగ్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగాన్ని ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నరసింహ, విజయమ్మ, నోమేశ్వరి, గురు శేఖర్, అబ్దుల్లా, నగేష్, నరసింహులు, సాయిబాబా, రామకృష్ణ, అబ్దుల్ దేశాయ్, సుధాకరప్ప, హుస్సేన్ భాష, గురు స్వామి, రమణ, కృష్ణ, లక్ష్మన్న, రాజేష్ తోపాటు మరో 30 మంది నాయకులు పాల్గొన్నారు.