రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చలికాలానికీ ఎండాకాలానికీ మధ్య ‘పరీక్షల’ కాలం!

How to write exams in telugu?How to prepare exams?How to Write in Exam Paper to Get Good Marks? Best Motivational quotes Telugu? exam tips in Telugu?
Peoples Motivation

చలికాలానికీ ఎండాకాలానికీ మధ్య ‘పరీక్షల’ కాలం!


Thumbnails 1111

చలికాలానికీ ఎండాకాలానికీ మధ్య పరీక్షా కాలం వచ్చేసింది. ఇళ్లల్లో సీను మారిపోయింది. టీవీలు మూగబోయాయి. ఫోన్లు సైలెంటైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల దగ్గర ప్రభుత్వం, ఇళ్ళలో అమ్మానాన్నలు 144 సెక్షన్‌ ప్రకటించారు. నిన్నమొన్నటివరకూ నాదంటే నాదని పోటీపడిన క్రికెట్‌ బ్యాట్‌ నేడు ఒంటరిగా మూలన పడివుంది. అన్నదమ్ముల పోట్లాటల్లేవు. అక్కాచెల్లెళ్ల వాదులాటలూ లేవు.మొత్తంగా వాతావరణం తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. పెద్దలకు పిల్లల టెన్షన్‌. పిల్లలకు పరీక్షల టెన్షన్‌!

అవును... పరీక్షల సీజన్‌ మొదలైపోయింది. మార్చి మొదటివారంలో ఇంటర్‌ పరీక్షలూ అవి అయిపోగానే పదో తరగతి పరీక్షలూ.

చిన్ని జీవితాలకు పెద్ద పరీక్షలు!. టెన్త్ అయిపోతే... రంగురంగుల కాలేజీ జీవితం ఊరిస్తుంటుంది ఒకవైపు.

పదో తరగతిలో ఎక్కువ పర్సంటేజీ తెచ్చుకుంటేనే మంచి కాలేజీలో సీటొస్తుంది... అంటారు టీచర్లు.

ఫెయిలైతే... భవిష్యత్తు భయపెడుతుంటుంది ఇంకోవైపు.

ఆఁ... పని లేకపోతే సరి... పదేళ్లు పడుతుంది ఆ డాక్టరీ అయ్యేసరికి. ఇంజినీరింగ్‌ చదివితే ఐదేళ్లకల్లా లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వస్తుంది... అంటాడు నాన్న. మరి పిల్లలేమనుకుంటున్నారు..?

‘చాలా టెన్షన్‌గా ఉంది. రివిజన్‌ చేస్తుంటే అంతా కొత్తగా ఉంది. ఏడాదంతా ఈ పాఠాలేనా చదివిందీ అని డౌటొస్తోంది...’

సైన్స్‌లో మంచి మార్కులొస్తే బైపీసీ తీసుకుని మెడిసిన్‌ చేద్దువుగాని... అంటుంది అమ్మ.

‘ముందు ఈ పరీక్షల గండం గట్టెక్కితే కదా, ఆ తర్వాత కాలేజీ చదువుల గురించి ఆలోచించేదీ...’

‘నాకేంటో పుస్తకం పట్టుకుంటే అక్షరాలు కనపడడం లేదు. తెల్ల కాగితాలే కన్పిస్తున్నాయి. ఫ్రెండ్సందరూ రెండోసారీ మూడోసారీ రివిజన్‌ చేస్తున్నారు. నాకు మొదటి రివిజనే కాలేదు. పరీక్షలు తలచుకుంటేనే వణుకొస్తోంది.’

‘చదవడం వరకూ అయితే బాగానే చదివాను కానీ పరీక్ష హాల్లోకి వెళ్లగానే అన్నీ మర్చిపోతానేమోనని భయమేస్తోంది...’

‘మా ఇంట్లో అందరూ టాపర్లే. నాకు 95 పర్సెంట్‌ కన్నా తక్కువ మార్కులొస్తే ఆ అవమానం తట్టుకోలేను’

... కాస్తో కూస్తో తేడాగా దాదాపు అందరి పరిస్థితీ ఇదేనని చెప్పడానికి ఎక్కడిదాకానో వెళ్లనక్కరలేదు. పదిమంది టీనేజర్లు చేరిన చోట కాసేపు నిలబడితే ఇలాంటి మాటలు ఎన్నో విన్పిస్తాయి.

ఇంటర్‌ రాసే పిల్లలకు బోర్డు పరీక్ష మొదలు మాత్రమే. ఆ తర్వాత నీట్‌, ఐఐటీ, ఎంసెట్‌... ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. పదో తరగతితో మొదలయ్యే ఈ పరీక్షల పరుగు కెరీర్లో స్థిరపడేవరకూ కొనసాగుతుంది. ఆ పరుగుకు మొదటి అడుగే ఈ బోర్డు పరీక్ష. అందుకే అందరికీ అంత టెన్షన్‌.

పదో తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ఎన్ని మార్కులొస్తాయో, ఏ కాలేజీలో సీటొస్తుందో ఏ గ్రూపు తీసుకోవాలో... అన్న టెన్షన్‌. 

పాతిక ఇరవయ్యేళ్ల క్రితం పదో తరగతిలో ఫస్ట్‌ క్లాసొస్తే గొప్ప. ఇప్పుడు ఎవరిని పలకరించినా ఎనభైలూ తొంభైలే. ఒక్క శాతం తేడా వచ్చినా కొంపలంటుకుపోయినట్లు బాధపడిపోతున్నారు పిల్లలూ తల్లిదండ్రులూ కూడా. చదువులు ఇప్పుడు పిల్లలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇరుగూపొరుగూ సహోద్యోగులూ బంధువులూ... అందరూ వారి మార్కుల గురించి ఆరా తీసేవారే. అలా పిల్లల మార్కులు కాస్తా పెద్దలకు ప్రతిష్ఠాత్మక అంశంగా మారిపోయాయి. దాంతో తమకు తెలియకుండానే చాలామంది పెద్దలూ ఆందోళనకు గురవుతున్నారు. టైమ్‌వేస్ట్‌ చేయకుండా చదువుకోమంటూ పిల్లల వెంట పడటమే కాకుండా వారి మీద తాము పెట్టుకున్న ఆశల్ని ఏకరువు పెడుతున్నారు. బోలెడు ఫీజులు కట్టి పెద్ద స్కూల్లోనో కాలేజీలోనో చదివించినందుకు ర్యాంకు తెచ్చుకుని పరువు నిలపమంటున్నారు. తమ సహోద్యోగుల పిల్లలు ఎన్ని మార్కులు తెచ్చుకుని ఎక్కడెక్కడ సీట్లు సంపాదించిందీ చెబుతున్నారు. అలా చెబితే పిల్లలు స్ఫూర్తి పొంది ఇంకా కష్టపడి చదువుతారని పెద్దల ఆశ. కానీ అది పరోక్షంగా పిల్లల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని కోరుకున్న కోర్సులో చేరాలని కలలు కనాల్సిన పిల్లలు తాము పరీక్ష బాగా రాయకపోతే నాన్న పరువు పోతుందనో అమ్మ బాధపడుతుందనో ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తోంది.

భయమే అసలు పరీక్ష

నిజానికి పిల్లలకు అసలు పరీక్ష- తమకు కష్టంగా ఉండే సబ్జెక్టులో మరొకటో కాదు, భయం. అదే వారెదుర్కొనే పెద్ద పరీక్ష. ఆ భయం వల్లనే కొందరు చదువుతున్నంత సేపూ అమ్మని పక్కన కూర్చోమంటారు. నిద్రలో ఉలిక్కిపడి లేస్తారు. ప్రతి చిన్నదానికీ విసుక్కుంటారు. సరిగా తిండి తినరు. నిద్రపోరు. ఆ భయాన్ని తరిమికొట్టాలి. అసలు ఇవ్వాళ్రేపు ఎల్‌కేజీ నుంచి పిల్లలు పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ర్యాంకులూ ప్రోగ్రెస్‌ రిపోర్టులూ చూసుకుంటూనే ఉన్నారు. ‘ఇది కూడా అలాంటిదే. కాకపోతే స్కూలు చదువుకు ముగింపు కాబట్టి దాన్ని బోర్డు పరీక్ష అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. జీవితంలో పైకి ఎదగడానికి అదొక నిచ్చెన మెట్టు. అంతేకానీ అది మన శత్రువు కాదు, మనతో పాటు కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. దానికి భయపడాల్సిన పనిలేదని’ పిల్లలకు నచ్చజెప్పాలి. అలా కాకుండా పరీక్షలనగానే అదేదో యుద్ధానికి తయారవుతున్నట్లుగా ఇంటి వాతావరణాన్ని గంభీరంగా మార్చేయడమూ ఎక్కడికీ వెళ్లకుండా కట్టడి చేయడమూ సినిమాలూ షికార్లే కాకుండా నడక, యోగా లాంటివి కూడా మానేసి దినచర్య అంతా పరీక్షల చుట్టూ తిరిగేలా మార్చేసుకోవడమూ... ఇలాంటివన్నీ చేయడం వల్లే పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. పరీక్షలప్పుడు కాస్త ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతూ వారికి మంచి ఆహారాన్నీ తగినంత విశ్రాంతినీ ఇస్తూ వారి బలాలేమిటో వారికి తెలిసేలా చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని వారు సూచిస్తున్నారు.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో...

ప్రెజర్‌ రిలీజ్‌ వాల్వ్‌ లేకపోయినా, వెయిట్‌ పెట్టే గొట్టం పూడుకుపోయినా ప్రెజర్‌ కుకర్‌ పేలిపోతుంది. ఒత్తిడి కూడా అలాంటిదే. దాన్ని ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే మనసు లోలోపల పేరుకు పోయి ఎప్పుడో ఓసారి తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఒత్తిడి వల్ల మెదడు విచక్షణాజ్ఞానం కోల్పోతుంది. సృజనాత్మకంగా ఆలోచించలేదు. చదివింది గుర్తుపెట్టుకోదు. ఒత్తిడికి లోనైన శరీరం వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి అనారోగ్యాలను ఆహ్వానిస్తుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒత్తిడికి మంచి విరుగుడు. సమయాన్ని తమకి అనుకూలంగా వాడుకోవటం తెలిసినవారిని ఒత్తిడి ఏమీ చేయలేదని విద్యార్థుల మీద చేసిన ఒక పరిశోధన చెబుతోంది. పిల్లలు కాసేపు పుస్తకం పక్కన పెట్టినా సమయం వృథా చేసేస్తున్నారని సీరియస్‌గా స్పందించే పెద్దలు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే- ఎంత ఎక్కువ సేపు చదివారన్నది కాదు, ఎంతసేపు మనసు పెట్టి చదివారన్నది ముఖ్యం. గంటల తరబడి కదలకుండా చదివితే బుర్రకు ఎక్కదు. ప్రతి గంటకీ ఒక పదినిమిషాలు విరామం ఇవ్వాలి. ఆ విరామంలో మనసుకు రిలాక్సేషన్‌ని ఇచ్చే ఇష్టమైన పని చేయనిస్తే ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి ఏడెనిమిది గంటలపాటు నిద్ర పోనివ్వాలి. తగినంత విశ్రాంతి ఉన్నప్పుడే మెదడు ఆరోజు నేర్చుకున్నదాన్ని జ్ఞాపకాల అరలో భద్రపరుస్తుంది. దానికి ఆ సమయాన్ని ఇవ్వకుండా ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. ఇలా కచ్చితంగా టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అలవాటు చేస్తే పిల్లలకు వాళ్ల మీద వాళ్లకి నమ్మకం కలుగుతుంది. ఆత్మస్థైర్యమూ పెరుగుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే...

ఎంత తెలివిగల పిల్లలైనా పరీక్షలనగానే కాస్త కంగారుపడిపోతారు. అరచేతుల్లో చెమటలు పట్టేస్తాయి. గుండె దడ దడా కొట్టుకుంటుంది. అలాంటివారు ప్రిపరేషన్‌ హాలిడేస్‌ నుంచే కొంచెం జాగ్రత్తపడితే చాలు- ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి వెళ్లొచ్చు.

పరిసరాలు శుభ్రంగా

ఏకాగ్రతగా చదువుకోవాలంటే- గది శుభ్రంగా ఉండాలి. చదువుకునే పుస్తకాలు తప్ప చుట్టుపక్కల ఇంకేవీ ఉండకూడదు. ఇరుగ్గా చీకటిగా ఉండే చోట కూర్చుంటే మనసు కూడా చికాగ్గా ఉండి దేనిమీదా దృష్టి పెట్టలేరు.

ఏదైనా ఇష్టంగా

ఏదైనా ఇష్టంగా చదివితే ఒత్తిడి 68 శాతం తగ్గిపోతుందని పరిశోధనలు రుజువుచేశాయి. కాబట్టి మార్కులకోసం అన్నట్లు కాకుండా సబ్జెక్టు మీద ఆసక్తి పెంచుకుని అర్థం చేసుకుంటూ చదవాలి. మధ్యలో బ్రేక్‌ తీసుకుని జోక్స్‌, కామెడీ వీడియోలు చూడడం లాంటివి చేస్తే మనసు పూర్తిగా రిలాక్స్‌ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ పాఠాలను శ్రద్ధగా చదువుకోవచ్చు.

టిఫిన్‌ తినాలి

ఒత్తిడిగా ఉన్నప్పుడు చాలామంది తిండి సరిగ్గా తినరు. ఆకలి తీర్చుకోడానికి స్వీట్సో ఫాస్ట్‌ఫుడ్సో తింటుంటారు. మరో పక్క శరీరమేమో సహజంగా ఒత్తిడిని ఎదుర్కొనడానికి కార్టిసోల్‌ హార్మోనును విడుదల చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించి బీపీ, జీవచర్యలను క్రమబద్ధం చేస్తుంది. అలాంటప్పుడు తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే ఆ హార్మోను పనితీరులో తేడా వస్తుంది. ఫలితంగా ఒత్తిడి మరింత పెరుగుతుంది. పైగా పొద్దున్నే తినే టిఫిన్‌ ఆధారంగానే మన శరీరం రోజు మొత్తానికి రక్తంలో చక్కెర స్థాయుల్ని సరిచూసుకుంటుంది. టిఫిన్‌ తినకపోతే ఆ పని అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకని సమయానికి సరైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి.

ఆత్రుత వద్దు

అన్నీ గబగబా చదివేయాలన్న ఆత్రుతతో పుస్తకాలన్నీ చుట్టూ పెట్టుకుని పది నిమిషాలకో సబ్జెక్టు మారుస్తూ కాసేపు చదువుతూ కాసేపు రాస్తూ మధ్యలో మరొకటేదో గుర్తొచ్చి అది వెతుకుతూ కంగారు పడిపోతుంటారు కొందరు. అది గుండె దడనీ ఒత్తిడినీ పెంచుతుంది. ఉన్న సమయాన్ని అన్ని సబ్జెక్టులకూ సమానంగా కేటాయిస్తూ టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాని ప్రకారం చదువుకోవాలి.

ఫోన్‌కీ ఒక టైమ్‌

స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు ఒక్కసారిగా దాన్ని పక్కన పెట్టేస్తే మరింత ఒత్తిడికి గురవుతారు. అలాంటివాళ్లు టైమ్‌ టేబుల్‌లో భాగంగా రోజూ ఓ పావుగంట మాత్రమే ఫోన్‌కి కేటాయిస్తే- అప్పుడు దానికి దూరమైన బాధా ఉండదు. చదువుకు ఆటంకమూ ఉండదు.

ఓ మంచి జ్ఞాపకం

మెదడు చురుగ్గా పనిచేయాలంటే సెరొటోనిన్‌ లాంటి హార్మోన్లు అవసరం. అందుకని చదువు మధ్యలో బ్రేక్‌ తీసుకున్నప్పుడు పెదవుల మీదికి నవ్వును తెప్పించే ఒక మంచి జ్ఞాపకాన్ని నెమరేసుకోవాలి. స్కూల్లో గెల్చుకున్న బహుమతో ఇంట్లో చేసిన చిలిపి అల్లరో... ఏదైనా కావచ్చు. దాని గురించి అమ్మతోనో అన్నాచెల్లెళ్లతోనో మాట్లాడితే ఆ జ్ఞాపకాలతో మనసు ఉల్లాసంగా మారుతుంది. తర్వాత ఉత్సాహంగా చదువుమీద దృష్టి పెట్టేలా చేస్తుంది.

వ్యాయామం

శారీరక వ్యాయామం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. నడక, యోగా, డ్యాన్స్‌... ఇష్టమైనది ఏదైనా సరే పదినిమిషాలు చాలు, ఒత్తిడి హుష్‌ కాకి.

సంగీతం వినడం 

మనసుకు హాయినిచ్చే పాటలు వినడమే కాదు, గొంతు విప్పి పాడుకున్నా ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత తరచుగా పాడుతూ ఉంటే అంతగా ఒత్తిడి తగ్గుతుందట.

రాయాలి

పరీక్షకు వెళ్లేముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారిపై పరిశోధకులు ఒక ప్రయోగం చేశారు. వారి మనసులో ఉన్న భయాలను ఒక కాగితం మీద రాయమన్నారు. అలా రాయడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గి పరీక్షని వాళ్లు ఊహించినదానికన్నా బాగా రాయగలిగారట. అందుకని అలా టెన్షన్‌ పడేవారు పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు మనసులో ఉన్న భయాలను ఒక కాగితం మీద వివరంగా రాస్తే, ఆ తర్వాత రిలాక్స్‌డ్‌గా లోపలికి వెళ్లి పరీక్ష బాగా రాసేయగలుగుతారని హామీ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. చూశారుగా... ఒత్తిడిని వదిలించుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో..!

ఒకసారి తరగతి గదిలో మాస్టారు ఏదో పనిచేసుకుంటుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు. అప్పుడా మాస్టారు బోర్డు మీద మూడు లెక్కలు ఇచ్చి పిల్లల్ని చేయమన్నారు. ‘మొదటి రెండూ మీలో చాలామంది చేయగలరు. చివరిది మాత్రం చాలా కష్టం. అది కూడా చేయగలిగినవారికి రేపు మంచి బహుమతి ఇస్తాను’ అని చెప్పి తన పని చేసుకున్నారాయన. మాస్టారు అన్నట్లే కొంతమంది మొదటి రెండూ చేశారు కానీ చివరిది ఎవరూ చేయలేకపోయారు. ఇంతలో బెల్‌ మోగింది. అందరూ వెళ్లిపోయారు. ఆరోజు బడికి రాని ఒక అబ్బాయి మర్నాడు అందరికన్నా ముందు వచ్చాడు. తరగతి గదిలో బోర్డు మీద లెక్కలు చూసి పుస్తకంలో రాసుకుని చేయడం మొదలుపెట్టాడు. పది నిమిషాల్లో మూడూ చేసేశాడు. ఇంతలో మాస్టారు వచ్చి ‘నిన్న ఇచ్చిన మూడు లెక్కలూ చేసినవాళ్లెవరో చేతులెత్తండి’ అంటే ఆ అబ్బాయి ఒక్కడే ఎత్తాడు.

‘మూడో లెక్క కష్టం అని నేను చెప్పింది తనకి తెలియదు కాబట్టి ఇది నేను చేయగలనా లేదా అని సందేహించకుండా ప్రయత్నించాడు, సాధించాడు. మీరంతా నేను అన్న మాట విన్నారు కాబట్టి మాస్టారే కష్టం అన్నారంటే అది మనవల్ల కాదులే అనుకున్నారు, అందుకే చేయలేకపోయారు. లెక్కలే కాదు, ఏ పని అయినా సరే, ‘నేను చేయగలను’ అన్న నమ్మకంతో మొదలుపెడితే తప్పకుండా చేయగలుగుతారు...’ చెప్పారు మాస్టారు. అర్థమైందిగా... పరీక్షలైనా అంతే..! బాగా రాయగలం అనుకుంటే రాసేస్తారంతే!

బెస్ట్‌ ఆఫ్‌ లక్‌..!

పరీక్ష రోజు...

జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టానికి శ్రీకారం చుట్టే రోజు ఇది. సంతోషంగా నిద్రలేవండి. ధైర్యంగా బయల్దేరండి.

👉త్వరగా తయారై పరీక్షకు అవసరమైనవన్నీ సర్దుకోండి.

👉తేలిక పాటి టిఫిన్‌ తినండి. పరీక్షాకేంద్రానికి సమయానికి చేరుకునేలా ముందుగానే బయల్దేరండి.

👉చివరినిమిషం దాకా చదవడం మనసుని మరింత గందరగోళంలో పడేస్తుంది. ఆటోలోనో బస్సులోనో బండిమీదో కూర్చుని చదవద్దు. చుట్టూ చూస్తూ రిలాక్స్‌ అవండి.

👉పరీక్ష గదిలోకి వెళ్లి కూర్చున్నాక ఒక నిమిషం పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేయండి. ఏమన్నా ఒత్తిడి మిగిలి ఉంటే పోతుంది.

👉ప్రశ్నపత్రం చూడగానే మైండ్‌ బ్లాంక్‌ అయిపోయినట్లూ ఏ ప్రశ్నకీ సమాధానం తెలియనట్లూ అన్పించినా కంగారుపడవద్దు. ప్రశాంతంగా ప్రశ్నపత్రం అంతా చదవండి. సగం చదివేసరికే తెలిసిన ప్రశ్నలు కన్పిస్తాయి. వాటికి జవాబులు రాయడం మొదలుపెడితే చాలు, వరసగా అన్నిటికీస మాధానాలు గుర్తొచ్చేస్తాయి.

👉బయటికి వచ్చాక రాసేసిన పరీక్ష మీద స్నేహితులతో చర్చ వద్దు. ఏ చిన్న తప్పు రాశామని తెలిసినా మూడ్‌ పాడవుతుంది. దాని వల్ల తగ్గేది ఒకటి రెండు మార్కులే కానీ పాడయ్యే మూడ్‌ ప్రభావం మర్నాటి పరీక్ష మొత్తం మీద పడుతుంది. అందుకని రాసేసిన పేపర్ని పక్కన పెట్టేసి తర్వాత పరీక్ష మీద పూర్తిగా దృష్టిపెట్టాలి.

యూట్యూబ్‌ ఇస్తుంది ధైర్యం!

అమ్మా... మాకు రేపటి నుంచి ప్రిపరేషన్‌ హాలిడేస్‌... అంటూ బ్యాగ్‌ అవతల పడేసి టీవీ రిమోట్‌ తీసుకుంటుంది అమ్మాయి. ‘అంటే చదువుకోడానికి సెలవులిచ్చారు, టీవీ చూడడానికి కాదు’ అంటూ రిమోట్‌ తీసుకుని జీవితంలో బోర్డ్‌ ఎగ్జామ్‌ ఎంత ముఖ్యమో అమ్మ చెబుతుంటే బిక్కమొహం వేస్తుంది అమ్మాయి. మహాతల్లి యూట్యూబ్‌ వీడియోల్లో‘అమ్మా.. పరీక్షల చదువూ’ అన్న ఎపిసోడ్‌ చూస్తే పిల్లలు అది తమ ఇంట్లో చూసి తీసిందేేమోనన్నంతగా లీనమైపోతారు. పరీక్షల ముందు విద్యార్థుల వింత ప్రవర్తన, ఫ్రెండ్స్‌కి ఫోన్‌ చేసి ఏయే చాప్టర్లు చదువుతున్నావూ అంటూ ఆరాలు తీయడం, అయ్యో ఫలానా చాప్టర్‌ చదవలేదా అందులోనుంచే పది మార్కుల ప్రశ్నలొస్తాయట అంటూ టెన్షన్‌ పెట్టడం, పుస్తకం పట్టుకుని పరీక్ష హాల్లో వరకూ చదువుకుంటూ వెళ్లడం, దేవుడి మీద భారం వేసి రాయడం మొదలెట్టడం... ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో విషయం తీసుకుని నవ్వుతూ నవ్విస్తూ ఆమె చెబుతుంటే విద్యార్థులంతా ఎక్కడో ఓ చోట తమనీ తమ ఫ్రెండ్స్‌నీ ఆ వీడియోల్లో చూసుకుంటారు. హాయిగా నవ్వుకుని రిలాక్స్‌ అవుతారు. పెద్దలూ వ్యక్తిత్వ వికాస నిపుణులూ చెప్పే సలహాలూ సూచనలకన్నా యువ యూట్యూబర్లు తామే పరీక్ష రాసే పిల్లల్లా నటిస్తూ సరదాగా చెప్పే విషయాలు పిల్లలకు బాగా నచ్చుతున్నాయి. ‘పరీక్షలంటే టెన్షన్‌గా ఉంది కదూ... అవును నేనూ అలాగే భయపడ్డాను...’ అంటూ ఆ భయాన్ని ఎలా అధిగమించాలో చెబుతారు ఒకరు. ‘పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కష్టపడి ఏడాదంతా చదివారు కదా కాన్ఫిడెంట్‌గా రాసేయండి, మంచి మార్కులొస్తాయి’ అంటూ మాటలతోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచేస్తారు మరొకరు. ‘అందరి మాటలూ నమ్మి అయోమయంలో పడిపోవద్దు... మిమ్మల్ని మీరు నమ్మండి, పరీక్షలు బాగా రాయండి’ అంటూ ధైర్యం చెబుతారు ఇంకొకరు. పరీక్షల సీజన్‌ వచ్చిందంటే చాలు- యూట్యూబ్‌ వీడియోల్లో వీరిదే ట్రెండు...✍️

Comments

-Advertisement-