రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) దుర్మరణం
అమీన్‌పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ దుర్ఘటన.. స్పాట్‌లోనే లాస్య మృతి
పది రోజుల క్రితమే నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, దివంగత సాయన్న కుమార్తె లాస్య నందిత
తండ్రి మరణం తనయకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్. శాసనసభ ఎన్నికల్లో 17 వేల మెజార్టీతో గెలిచిన లాస్య నందిత
దుర్మరణంపై సీఎం రేవంత్, కేసీఆర్ పలువురు రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
హైదరాబాద్/ సికింద్రాబాద్, ఫిబ్రవరి 23 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రవిషాదం. శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారు నడిపిన డ్రైవర్ ఆకాష్ కు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ వారు హాజరై తిరిగి వస్తుండగా.. వాహనం ప్రమాదానికి గురైందని. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు విచారిస్తున్నారు. ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని తప్పించుకోవడానికి సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్ కు బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగింది ఆ సమయంలో ఎమ్మెల్యే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్రగాయలైన డ్రైవర్ ను మదీనగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్ చెరువు అమెథా ఆసుపత్రికి తరలించారు. బిడ్డ మరణవార్త విన్న తల్లి స్పృహ తప్పి పడిపోయింది. సోదరి నివేదిత గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన వల్ల రాజకీయ వర్గాల్లో విషాధ ఛాయలు అలుముకుంటున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు... యువ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె తండ్రి సాయన్నతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం లాస్య నందిత మృతిపై సంతాపం తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు తలసాని, హరీష్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి.. లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్ పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది. ఆ సమయంలోనూ ఆకాశే కారు నడిపినట్లు సమాచారం. తండ్రి సాయన్న 2023 ఫిబ్రవరి 19 న కన్నుమూశారు. తండ్రి చనిపోయిన ఏడాదికే రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందడం.
ఎమ్మెల్యే గా ఎన్నికైన కొద్ది రోజులకే... లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత ఏడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. సాయన్న నాలుగు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.2018లో TRS నుంచి విజయం సాధించారు. సాయన్న మరణం తర్వాత ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించింది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉంటుందని తరుణంలో.. అదీ చిన్న వయసులో ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
లాస్య నందిత కుటుంబ నేపథ్యం.. సాయన్న, గీతలకు ముగ్గురు కుమార్తెలు లాస్య నందిత, నమ్రత, నివేదిత. లాస్య కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్ (2016) లో పని చేశారు.